ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: రోహిత్ శర్మకు కెరీర్ బెస్ట్, కోహ్లీ కిందకి

Submitted on 8 October 2019
ICC Test Rankings: Rohit Sharma attains career-best spot, Virat Kohli drops below 900 points

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టుల్లోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే అత్యుత్తమ ర్యాంకుకు ఎగబాకాడు. ఇటీవల ఐసీసీ విడుదల చేసిన ర్యాంకుల్లో కెరీర్లోనే బెస్ట్ ర్యాంకును చేరుకోగలిగాడు. అతను 36 స్థానాలు దాటుకుని 17వ ర్యాంకును చేరుకోవడం విశేషం. చివరిగా వైజాగ్ వేదికగా ముగిసిన దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

రోహిత్‌కు జోడీగా మరో ఎండ్‌లో రెచ్చిపోయిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ర్యాంకు మెరుగైంది. 38 స్థానాల్ని దాటుకుని కెరీర్‌ బెస్ట్‌ 25వ ర్యాంకుకు చేరుకున్నాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్థానంలో మార్పు లేకుండా రెండో స్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ 900 రేటింగ్‌ పాయింట్ల నుంచి తగ్గాడు. గతేడాది జనవరి నుంచి 900 పైబడిన రేటింగ్‌ పాయింట్లతో ఉన్న కోహ్లి ఖాతాలో 899 పాయింట్లున్నాయి. 

టాప్‌ ర్యాంకులో ఉన్న స్టీవ్‌ స్మిత్‌ (937, ఆస్ట్రేలియా) కంటే 38 పాయింట్లు తక్కువ ఉన్నాయి. టెస్టు బౌలర్ల జాబితాలో మళ్లీ భారత స్పిన్నర్‌ అశ్విన్‌ టాప్‌–10లోకి చేరాడు. తొలి టెస్టులో 8 వికెట్లు తీయడం ద్వారా 4 స్థానాల్ని మెరుగుపర్చుకొని పదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఐసీసీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భాగమైన ఈ సిరీస్‌లో భారత్‌  తొలి టెస్టు విజయంతో 40 పాయింట్లను ఖాతాలో వేసుకొని మొత్తం 160 పాయింట్లతో ఉంది. విండీస్‌పై 2–0తో గెలవడం ద్వారా 120 పాయింట్లను పొందింది.

ICC Test Rankings
icc
Rohit Sharma
career best
Virat Kohli

మరిన్ని వార్తలు