గుడ్ న్యూస్ : సివిల్స్ ఇంటర్వ్యూలో ఫెయిలైనా ప్రభుత్వ ఉద్యోగం

Submitted on 8 February 2019
IAS Aspirants Not Able To Clear Interview Stage Could Get Other Central Jobs

ఢిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌‌ పరీక్ష రాసి చివరి మెట్టు వరకూ వెళ్లినా ఉద్యోగం రాలేదని బాధపడే వారి గుడ్ న్యూస్. సివిల్స్‌లో మెయిన్స్‌ క్లియర్‌ చేసి ఇంటర్వ్యూలో ఫెయిలైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వంలో ఇతర ఉద్యోగాలు దక్కేలా ఓ ప్రతిపాదనను యూపీఎస్సీ చేసింది. యూపీఎస్సీ చేసిన ఈ సిఫారసుని కేంద్రం కనుక ఆమోదిస్తే వేలాది మంది సివిల్స్‌ ఆశావహులకు కొంత ఊరట లభించినట్లవుతుంది. భువనేశ్వర్‌లో ఈ మధ్య వివిధ రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల చైర్మన్ల సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న యూపీఎస్సీ ఛైర్మన్‌ అరవింద్‌ సక్సేనా ఈ ప్రతిపాదన గురించి వివరించారు.

 

సివిల్స్‌లో ఇంటర్య్వూల వరకూ వచ్చిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోండని సిబ్బంది వ్యవహారాల శాఖకు, వివిధ మంత్రిత్వ శాఖలకూ లేఖలు రాశామని సక్సేనా చెప్పారు. ఏటా సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్షకు దేశవ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కానీ ప్రిలిమ్స్‌ దాటి మెయిన్స్‌కు వచ్చే సరికి ఆ సంఖ్య 40 శాతానికి తగ్గిపోతోంది. మెయిన్స్‌దాటి ఇంటర్వ్యూకి వచ్చే సరికి ఆ సంఖ్య కాస్త 10-20 శాతానికి పడిపోతోంది.

 

2018 సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షకు దేశ వ్యాప్తంగా 8లక్షల మంది దరఖాస్తు చేయగా వీరిలో కేవలం 10వేల 500మంది అభ్యర్థులు మాత్రమే మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరి నుంచి కేవలం 2వేల మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. కానీ నోటిఫికేషన్‌లో ఉన్న ఖాళీల సంఖ్య 782 మాత్రమే. దీంతో 1200 మంది ఇంటర్వ్యూల్లో ఫెయిలై వెనుదిరుగుతున్నారు. సివిల్స్‌లో ఇంటర్వ్యూ వరకూ వచ్చారంటే ఆ అభ్యర్థిని సమర్ధుడిగానే పరిగణిస్తారు. ప్రతిభ ఉన్న ఇలాంటి వారందరినీ ఎందుకు వదిలేయడం? దేశానికి ఇలాంటి వారూ కావాలి.. వీరి సేవల్ని వినియోగించుకోవాలి అని యూపీఎస్సీ నిర్ణయించి కేంద్రానికి సిఫారసు చేసినట్లు అరవింద్‌ సక్సేనా తెలిపారు.

 

యూపీఎస్సీ తీసుకున్న మరో కీలక నిర్ణయం... మెయిన్స్‌ రాసిన వారందరి స్కోర్లు ఆన్‌లైన్‌లో పెట్టడం. ఇలా చేయడం వల్ల వారి ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కానివారకి ప్రైవేటు ఉద్యోగమే శరణ్యమవుతోంది. ప్రైవేటు సంస్థలు ఈ డాటాను సానుకూలంగా వాడుకోడానికి వీలుంటుంది. ఎవరి ప్రతిభ ఎందులో ఉందన్నది ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌లో కంటే ప్రైవేటు సంస్థలే మెరుగ్గా అంచనావేస్తాయని, ఆ దృష్ట్యా ఆన్‌లైన్‌లో స్కోర్లు చూసి వారిని ఇంటర్వ్యూలకు కంపెనీలే పిలిపించి ఉద్యోగాలు ఇస్తాయని ఓ అధికారి అన్నారు.

IAS Aspirants
Not Able To Clear Interview Stage
Could Get Other
Central Jobs
UPSC Recommends Proposal
civil services

మరిన్ని వార్తలు