నేను లంచం తీసుకోను : తన నిజాయతీ తెలుపుతూ ఆఫీస్ లో బోర్డు పెట్టిన ప్రభుత్వ అధికారి

Submitted on 17 November 2019
iam un corrupted, govt officer keeps big board in office

ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు జరగాలంటే అధికారుల చేతులు తడపాల్సిందే. లంచం ఇస్తే కానీ ఏ పనీ జరగదు. కాదు కూడదు అంటే.. కాళ్లు అరిగేలా తిప్పుకుంటారు. లంచాలు ఇచ్చుకోలేక కొందరు ఏసీబీని ఆశ్రయిస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో దాదాపు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ లంచావతారులే, అవినీతి పరులే అనే ముద్ర ఉంది. ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేసే ఉద్యోగులు, అధికారులపై ప్రజలకు మంచి అభిప్రాయం లేదు.

ఈ పరిస్థితుల్లో ఓ ప్రభుత్వ అధికారి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన పెట్టిన బోర్డు చర్చకు దారితీసింది. ''నేను లంచం తీసుకోను'' అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన బోర్డుని తన చాంబర్ లో పెట్టుకున్నారు ఆ అధికారి. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ లంచం తీసుకునే వారే, అవినీతిపరులే అంటే పొరపాటే అంటారాయన. తనలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ కూడా ఉంటారని చెప్పడానికే ఈ ప్రయత్నం అని వివరిస్తారు.

వివరాల్లోకి వెళితే.. ఆ ప్రభుత్వ అధికారి పేరు పోడేటి అశోక్. కరీంనగర్ విద్యుత్ శాఖలో సర్కిల్ ఆఫీస్ లో కమర్షియల్ ఏడీఈ(అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్) గా పనిచేస్తున్నారు. ''నేను లంచం తీసుకోను'' అని ఆఫీస్ లో బోర్డు పెట్టించారాయన. ఎందుకిలా చేశారు అని అడిగితే.. అధికారులు అందరూ లంచాలు తీసుకునే వారు అంటే తాను ఒప్పుకోను అంటారు. సిన్సియర్ గా పని చేసే వాళ్లు కూడా ఉంటారని చెబుతారు. ప్రభుత్వ ఆఫీసుల్లో అందరూ నిజాయతీగా పనిచేస్తే అవినీతి రహిత వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని చెప్పారు. కాగా.. ‘నేను లంచం తీసుకోను’ అంటూ ఏడీఈ పెద్ద అక్షరాలతో ఆఫీస్ లో బోర్డు రాయించి పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు భూ వివాదంతో పాటు లంచం కూడా కారణం అనే ప్రచారం జరుగుతోంది. ఇక రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్‌ లావణ్య ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె ఇంట్లో రూ. 93లక్షల నగదు, 40తులాలకు పైగా బంగారం గుర్తించారు. ఈ ఘటనలతో ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజలకు నమ్మకమే పోయింది. అందుకే తాను ఈ పని చేయాల్సి వచ్చిందని అశోక్ చెప్పారు.

''నేను లంచం తీసుకోను'' అనే బోర్డు సోషల్ మీడియాలో ఇప్పుడీ ఫొటో వైరల్ గా మారింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు స్వాగతిస్తున్నారు, కొందరు విమర్శిస్తున్నారు. తమ నిజాయతీని నిరూపించుకోవడానికి చివరికి ఇలా బోర్డులు పెట్టుకునే దుస్థితికి అధికారులు దిగజారాల్సి వచ్చిందని కొందరు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరేమో.. వెరీ గుడ్ సార్ అంటూ ప్రశంసిస్తున్నారు.

iam un corrupted
Officer
keeps board
Bribe
Karimnagar
ade
podeti ashok

మరిన్ని వార్తలు