కంటతడి పెట్టిస్తున్న ఫోటో : నదిలో ఈదుతూ బిడ్డతో సహా శరణార్థి తండ్రి మృతి

Submitted on 26 June 2019
'Heartbreaking' pic..Died daughter of a swimming father in the Rio Grande River, Mexico, USA

ఒక్కసారి పోతే తిరిగి రానిది ప్రాణం. ఒక పక్క బతకాలనే ఆశ..కన్నబిడ్డలను బతికించుకోవాలనే తపన..వెరసి శరణార్ధులు ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. బతకాలని..కన్నబిడ్డను బతికించుకోవాలని ఓ తండ్రి నదిలో ఈదుతూ..ఈదుతూ చివరికి బిడ్డతో సహా ప్రాణాలు కోల్పోయాడు. అమెరికా-మెక్సికో సరిహద్దు దగ్గర రియో గ్రాండే నదీతీరంలో విగతజీవులుగా పడి ఉన్న వీరి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యావత్ ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తోంది. గుండెల్ని పిండేస్తోంది. శరణార్ధుల దయనీయ స్థితిని కళ్లకు కడుతోంది.


అమెరికాలో ఆశ్రయం పొందేందుకు శతవిధాల యత్నించి చివరికు చిన్నారి కుమార్తెతో సహా నదిలో ఈదుతూ ప్రాణాలు కోల్పోయాడో తండ్రి. బతుకుదెరువు కోసం, సురక్షిత తీరాలకు తరలి వెళ్లేందుకు శరణార్థులు ఎలా ప్రాణాలకు తెగిస్తున్నారో ఈ దృశ్యం కళ్లకు కడుతుంది.  తండ్రీ కుమార్తెలిద్దరూ బోర్లా పడి ఉండగా..తండ్రి టీషర్టులో దూరిన ఆ చిన్నారి తండ్రి మెడపై చేయివేసి ఉంది. అమెరికా ‘ఐలాన్ కుర్ది’ ఘటనగా చెబుతున్న ఈ దృశ్యం హృదయాలను పిండేస్తోంది.

2015లో సిరియా శరణార్థుల సంక్షోభం సమయంలో మధ్యదరా సముద్రంలో బీచ్ లో విగతజీవిగా పడి ఉన్న మూడేళ్ల బాలుడి ఫోటో యావత్ ప్రపంచాన్ని కదిలించింది. సముద్రంలో ఓడలో వెళుతూ.. తల్లిదండ్రుల చేతి నుంచి జారి సముద్రంలో పడిపోయిన  ఆ చిన్నారి.. ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృదేహం ఒడ్డుకి కొట్టుకొచ్చింది. ఇటువంటి ఘటనకు మరో దృశ్యంగా ఈ తండ్రీ కుమార్తెల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 
ఎల్ సాల్వడార్ కి  చెందిన ఆస్కార్ అల్బెర్టో మార్టనేజ్ రమిరేజ్‌ అనే వ్యక్తి.. బతుకుదెరువు కోసం అమెరికా వెళ్లే ప్రయత్నం చేశాడు. అమెరికాలో వలసదారులపై నిఘా ఎక్కువగా ఉండటంతో.. ప్రమాదకరమైన నదీ మార్గం ఎంచుకున్నాడు. తన 23 నెలల చిన్నారి వాలెరియాతో కలిసి నదిలో ఈదుకుంటూ వెళ్లాడు. తనకు కుమార్తెను నదీ తీరానికి చేర్చి భార్యను తీసుకొచ్చేందకు వెనుతిరిగాడు. తండ్రి తనను వదిలి వెళ్లిపోతున్నాడనే భయంతో ఆ చిన్నారి తండ్రి దగ్గరకు వచ్చేయటానికి నదిలో దూకేసింది. ఇది గమనించి బిడ్డను రక్షించేందుకు మార్టనెజ్ పట్టుకున్నప్పటికీ నీటి ప్రవాహం ఉదృతికి తట్టుకోలేకపోయాడు. దీంతో ఇద్దరూ నదిలో కొట్టుకుపోయారు. ఈ క్రమంలో తండ్రి మెడను గట్టిగా పట్టేసుకుంది. అలా నదిలో కొట్టుకుపోయి తండ్రీ కుమార్తె ఇద్దరు మృతి చెందారు. వారి మృతదేహాలు ఒడ్డుకి కొట్టుకుని వచ్చాయి.

ఈ ఫోటో గుండెలు బరువెక్కిస్తోంది.  ప్రాణం కోసం వారు చేసిన పోరాటం నీటిపాలైపోయింది. భర్త, బిడ్డ దూరంకావటంతో పుట్టెడు శోకంతో  గుండెలవిసేలా విలపిస్తోంది తల్లి రోసా రమిరెజ్.

'Heartbreaking' pic
father
Daughter
swimming
died
Rio Grande River
Mexico
usa


మరిన్ని వార్తలు