నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : బీసీ గురుకులాల్లో 1698 పోస్టులు భర్తీ

Submitted on 13 July 2019
Good News, Telangana Gurukulam Recruitment

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బీసీ గురుకులాల్లో 1698 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవలే మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాలను ప్రభుత్వం ప్రారంభించింది.  ఈ గురుకులాల్లో టీచర్లు, ప్రిన్సిపల్, ఇతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో 1071 టీజీటీ, 119 పీఈటీ, 36 ప్రిన్సిపల్ సహా ఇతర పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం(జూలై 12,2019) ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఆర్‌ఈఐ-ఆర్బీ) ద్వారా ఈ మొత్తం పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. స్థానికత, ఆయా ప్రాంతాల్లో పోస్టుల ఖాళీలు, రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా అర్హులను ఎంపిక చేసి నియమించాలన్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సమయంలో తెలంగాణలో బీసీ గురుకులాలు 19 మాత్రమే ఉన్నాయి. బీసీ కుటుంబాల్లో విద్యా వెలుగులు నింపాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2016-17 విద్యా సంవత్సరంలో మాదిరిగానే.. ఈ విద్యా సంవత్సరం కూడా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ గురుకుల విద్యాలయాలను ఏర్పాటుచేశారు. దీంతో బీసీ గురుకులాల సంఖ్య 280కి పెరిగింది. బీసీ గురుకులాల్లో వసతుల కల్పనతోపాటు బోధనా సిబ్బంది నియామకాలను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నారు.

కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానాన్ని అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ దూరదృష్టితో గురుకుల విద్యాలయాలను బలోపేతం చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. 2019లో కొత్తగా 119 బీసీ గురుకులాలను ప్రారంభించుకున్నామన్నారు. వీటి కోసం 1,698 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే నియామక ప్రక్రియ చేపడుతారని ఆయన వెల్లడించారు.

Good news
Telangana
Government
Gurukulam
gurukulam schools
Posts
jobs
Education
employment

మరిన్ని వార్తలు