గోదావరి బోటు ప్రమాద ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే.. బాధితులకు పరామర్శ

Submitted on 16 September 2019
godavari boat accident, cm jagan aerial survey

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో బోటు ప్రమాదం ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేశారు. విమానం నుంచి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్ పనులను కూడా పరిశీలించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను వేగవంతం చేయాలన్నారు. సీఎం వెంట హోంశాఖ మంత్రి సుచరిత, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ ఉన్నారు.

అక్కడి నుంచి నేరుగా రాజమండ్రిలోని ప్రభుత్వ ఆస్పత్రికి సీఎం వెళ్లారు. బోటు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న వారిని జగన్ పరామర్శించారు. వారితో మాట్లాడారు. బోటు ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటామని సీఎం జగన్ వారికి భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులతోనూ సీఎం మాట్లాడారు.

విహార యాత్ర విషాదంగా మారింది. గోదావరిలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరిలో పర్యాటక బోటు మునిగిపోయింది. ఇప్పటివరకు 13 మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం 71మందితో పర్యాటక బోటు బయల్దేరింది. బోటులో 61మంది పర్యాటకులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 36మంది పర్యాటకుల ఆచూకీ గల్లంతైంది. పాపికొండలు విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. రాయల్ వశిష్ట బోటు నిర్వాహాకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సైడ్ స్కాన్ సోనార్ టెక్నాలజీ ద్వారా మృతదేహాల కోసం గాలిస్తున్నారు.

ఆదివారం(సెప్టెంబర్ 15,2019) ఉదయం 10.30 గంటలకు రాయల్ వశిష్ట టూరిస్ట్ బోటు పాపికొండలకు బయలుదేరింది. గండిపోచమ్మ ఆలయం దాటి... ముందుకు వెళ్తున్న క్రమంలో... దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర ఘోర ప్రమాదానికి గురైంది. వరద ఉధృతిని తట్టుకోలేక బోటు మునిగిపోయింది. లైఫ్ జాకెట్లు ఉన్న వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరిని.. చుట్టుపక్కల గ్రామస్తులు, మత్స్యకారులు కాపాడారు.

cm jagan
aerial survey
Godavari
Boat Accident
Rajahmundry
hospital

మరిన్ని వార్తలు