జగన్ వచ్చాక పరిస్థితి మారింది : ఏపీతో స్నేహపూర్వక సంబంధం కొనసాగిస్తాం

Submitted on 18 June 2019
friend ship relations with ap, says cm kcr 

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తో స్నేహపూర్వక సంబంధం కొనసాగిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉంటే.. రెండు రాష్ట్రాలు అభివృద్ది చెందుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. సమావేశం వివరాలను సీఎం కేసీఆర్ మీడియాకు వివరించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సంబంధాలతో పాటు పొరుగు రాష్ట్రాలతో రిలేషన్స్ పై కేబినెట్ లో విస్తృతంగా చర్చించామన్నారు. పొరుగు రాష్ట్రాలతో సత్ సంబంధాలు కొనసాగించాలని కేబినెట్ లో నిర్ణయించినట్టు కేసీఆర్ చెప్పారు. ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్నాటకతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామన్నారు. స్నేహ పూర్వకంగా ఉండటం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయని కేసీఆర్ చెప్పారు.

జల వివాదాలు పరిష్కారం అయ్యాయని, ప్రాజెక్ట్ నిర్మాణాలకు అడ్డంకులు తొలిగాయని కేసీఆర్ వివరించారు. తెలంగాణ నీటి ప్రాజెక్టులకు పొరుగు రాష్ట్రాలు సహకరిస్తున్నాయని కేసీఆర్ వెల్లడించారు. మహారాష్ట్ర సర్కార్ సహకారంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తయిందన్నారు. 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతోందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా తెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందించిందని కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్ర ముందుకొచ్చి స్థలాలు ఇవ్వడంతో కరకట్టల నిర్మాణం పూర్తయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని కేసీఆర్ చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు శుభం జరగాలని కేసీఆర్ కోరుకున్నారు. తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్తాయన్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య గతంలో చాలా వివాదాలు ఉండేవని, బస్తీమే సవాల్ అన్నట్లుగా వాతావరణం ఉండేదన్నారు. ఏపీలో ప్రభుత్వం మారాక, వైఎస్ జగన్ సీఎం అయ్యాక పరిస్థితి మారిందన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఏర్పడిందని, సమస్యలు పరిష్కారం అవుతున్నాయని కేసీఆర్ చెప్పారు. ఇది చాలా మంచి పరిణామం అని కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఏపీ భవనాలు తెలంగాణకు అప్పగింత పూర్తయిందన్నారు. 
 

CM KCR
Telangana
Andhra Pradesh
friendly relations
Ys Jagan
telangana cabinet


మరిన్ని వార్తలు