
అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలైంది. జమైత్ ఉలేమా ఇ హింద్ సంస్థ సోమవారం సుప్రీం కోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. దశాబ్దాల వివాదానికి ముగింపు పలుకుతూ గత నెలలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పటినుంచి దాఖలైన మొదటి రివ్యూ పిటిషన్ ఇదే.
రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంపై ఆ సంస్థ చీఫ్ మౌలానా అర్షద్ మదాని మాట్లాడుతూ...అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం కోర్టు ఇచ్చిన హక్కు. దేశంలోని మెజారిటీ ముస్లింలు అయోధ్య పై సుప్రీం వెలువరించిన తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నారు. కొందరు మాత్రమే రివ్యూ పిటిషన్ వద్దనుకుంటున్నారు. అయోధ్య కేసులో.. మందిరాన్ని కూల్చి మసీదును నిర్మించారనేది వివాదస్పద అంశమని ఆర్షద్ తెలిపారు. కానీ ఆ ఆరోపణలకు ఆధారాలు లేవని కోర్టు కూడా చెప్పిందని అన్నారు. కానీ తీర్పు మాత్రం అందుకు వ్యతిరేకంగా వెలువడిందన్నారు. అందువల్లే తాము రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, సుప్రీం అయోధ్య కేసులో తీర్పు వెలువరించిన తరువాత దాఖలైన తొలి రివ్యూ పిటిషన్ ఇదే.
మరోవైపు 99 శాతం ముస్లింలు అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని కోరుకుంటున్నారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) ఆదివారం తెలిపింది. డిసెంబర్ 9న రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఏఐఎంపీఎల్బీ వెల్లడించింది. అయితే ముస్లింల తరఫున పిటిషన్‌దారు అయిన సున్నీ వక్ఫ్ బోర్డు అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమని స్పష్టం చేసింది.