కదం తొక్కిన కంది రైతులు : మార్క్‌ఫెడ్‌ అధికారుల తీరుపై నిరసన

Submitted on 16 February 2019
Farmers concerned in market yards

మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లాలో కంది రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. వర్షాభావంతో ఈసారి పంట దిగుబడి బాగా తగ్గింది. కొద్దో గొప్పో చేతికి వచ్చిన పంటను కూడా కొనుగోలు చేసే దిక్కులేకపోవడంతో మార్కెట్‌ యార్డుల్లోనే రైతులు ఆందోళనకు దిగారు. 

గద్వాల మార్కెట్‌ యార్డులో మార్క్‌ఫెడ్‌ కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. క్వింటాలుకు 5,670 రూపాయల కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ కందుల నాణ్యత సరిగా లేదని సాకు చూపుతూ మార్క్‌ఫెడ్‌ అధికారులు ధరలు తగ్గించారు. మూడు రోజులుగా కొనుగోలు కూడా చేయకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రంలోనే ధర్నా చేస్తున్నారు... మార్క్‌ఫెడ్‌ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 14న గద్వాల మార్కెట్‌కు కందులు తీసుకొచ్చినా.. మార్క్‌ఫెడ్‌ అధికారులు ఇంతవరకు కొనుగోలు చేయకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు కొనుగోలు చేసిన కంది పంటకు మార్క్‌ఫెడ్‌ ఇంతవరకు పైసలు ఇవ్వలేదు. పంట కొని మూడు రోజుల్లో రైతు బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేస్తామన్న అధికారులు మాట నిలుపుకోలేదు. మొత్తం 25 వేల 600 మంది రైతుల నుంచి రెండు లక్షల క్వింటాళ్ల కందులు కొన్నారు. దీనికిగాను 156 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. మొదటి విడత 40 కోట్ల రూపాయలు విడుదల చేశామని మార్క్‌ఫెడ్‌ అధికారులు చెబుతున్నా... ఇంతవరకు తమ ఖాతాల్లో రూపాయి కూడా జమకాలేదని రైతులు చెబుతున్నారు. కంది పంట మొత్తాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయకపోయినా.. కొన్న పంటకు వెంటనే డబ్బు చెల్లించపోయినా.. ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. 
 

kandi Farmers
concerned
market yards
Mahabubnagar

మరిన్ని వార్తలు