రోడ్డెక్కిన అన్నదాత : నిజామాబాద్ లో రైతుల ఆందోళన

Submitted on 16 February 2019
The farmers' concern in Nizamabad

నిజామాబాద్ : పసుపు, ఎర్రజొన్న రైతుల ఆందోళనతో నిజామాబాద్‌ జిల్లా అట్టుడికింది. ఈ రెండు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు చేపట్టిన  మహాధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. జాతీయ రహదారుల దిగ్బంధంతో రవాణ వ్యవస్థ స్తంభించింది. రైతుల ధర్నాలు, నిరసనలతో జిల్లా హోరెత్తింది. పసుపు, ఎర్రజొన్న రైతులు చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. పసుపును క్వింటాలుకు 15 వేల రూపాయలు, ఎర్రజొన్నలను క్వింటాలుకు 3,500 రూపాయలకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ  రైతులు జాతీయ రహదారులను దిగ్బందించారు.

పెర్కిట్‌, జక్రాన్‌పల్లి, దర్పల్లిలో పసుపు, ఎర్రజొన్న రైతులు మద్దతు ధర కోసం రహదారులను దిగ్బంధించారు. జాతీయ రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో  వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఎర్రజొన్న కంకులను పట్టుకుని రైతులు రోడ్లపై నిరసన తెలిపారు. మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేయని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జక్రాన్‌పల్లిలో మహిళా రైతులు ఆందోళనకు దిగారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రభుత్వం దిగొచ్చి పసుపు, ఎర్రజొన్న పంటలకు  మద్దతు ధర  ఇచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని రైతులు తేల్చి చెప్పారు. 

పసుపు, ఎర్రజొన్న రైతులు ఆందోళన చేయడం ఈనెలలో ఇది మూడోసారి. ఫిబ్రవరి 7, 12 తేదీల్లో ధర్నాలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో మళ్లీ రహదారులను దిగ్బంధించారు. పసుపు, ఎర్రజొన్న రైతుల మహాధర్నా నేపథ్యంలో ఆర్మూర్‌, బాల్కొండ, నందిపేట ప్రాంతాలకు చెందిన అన్నదాతలను పోలీసులు ముందుగానే అరెస్ట్‌ చేసి ఠాణాలకు తరలించారు.  అరెస్టైన రైతులు పోలీస్‌ స్టేషన్లలోనే ధర్నాలు చేసి, నిరసన తెలిపారు. 

nizamabad
Farmers
Turmeric
red jowar
Support price
price procure
Telangana

మరిన్ని వార్తలు