మోడీ హవాలో కొట్టుకుపోయిన 12మంది మాజీ సీఎంలు

Submitted on 24 May 2019
ex chief ministers lost in loksabha elections

సార్వత్రిక ఎన్నికల్లో 303 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ ప్రభంజనం సృష్టించింది. గతంలో కంటే రికార్డు స్థాయిలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకొని తన రికార్డును తానే బద్ధలు కొట్టింది. దేశవ్యాప్తంగా మోడీ హవా బలంగా ఉండటంతో మహామహులు సైతం మట్టికరిచారు. దశాబ్ధాల పాటు దేశరాజకీయాల్లో చక్రం తిప్పన నేతలు కూడా ఇంటిబాట పట్టారు. 12 మంది మాజీ ముఖ్యమంత్రులకు సార్వత్రిక ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది.అందులో ఎనిమిది మంది కాంగ్రెస్‌ వాళ్లే కావడం విశేషం
 
  షీలా దీక్షిత్
ఢిల్లీకి 3సార్లు సీఎంగా పనిచేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షీలా దీక్షిత్‌ కు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఈశాన్య ఢిల్లీ నుంచి లోక్ సభకు పోటీచేసిన ఆమె ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ చేతిలో ఓటమిపాలయ్యారు. ఢిల్లీలోని అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.

సుశీల్ కుమార్ షిండే
వెటరన్‌ కాంగ్రెస్‌ లీడర్‌, మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌ కుమార్‌ షిండేకు ఓటమి తప్పలేదు. షోలాపూర్‌ నియోజవర్గం నుంచి పోటీచేసిన ఆయన బీజేపీ అభ్యర్థి సిద్దేశ్వర్‌ శివాచార్య చేతిలో లక్షన్నర ఓట్ల తేడాతో దారుణ వైఫల్యం చెందారు. మహారాష్ట్రలో కేవలం ఒక్క స్థానంలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది.

భూపిందర్ సింగ్ హుడా
హర్యాణా మాజీ సీఎం, సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్‌ భూపిందర్‌ సింగ్‌ హుడాకు ఓటమి తప్పలేదు. సోనీపట్‌ నుంచి బరిలో దిగిన హుడా..బీజేపీ అభ్యర్థి రమేశ్‌ చందర్‌ చేతిలో లక్షన్నరకు పైగా ఓట్లతో ఓడిపోయారు.హర్యానాలోని అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.కాంగ్రెస్ ఒక్క సీటుని కూడా దక్కించుకోలేకపోయింది.

వీరప్ప మొయిలి
కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీ కూడా మోడీ హవాను తట్టుకుని నిలబడలేకపోయాడు. చిక్ బల్లాపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన ఆయన బీజేపీ అభ్యర్థి బచే గౌడ చేతిలో ఓడిపోయారు.

దిగ్విజయ్ సింగ్
మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ చిత్తుగా ఓడిపోయారు. భోపాల్‌ నుంచి బరిలోకి దిగిన ఆయన బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ చేతిలో 3.6లక్షల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలతో సాధ్వి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

దేవెగౌడ
జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ(87) సైతం ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి అభ్యర్థిగా తుముకూరు నుంచి బరిలో నిలిచిన దేవెగౌడ మోడీ హవాను తట్టుకొని నిలవలేకపోయారు. బీజేపీ అభ్యర్థి జీఎస్‌ బసవరాజ్‌ చేతిలో 13వేల ఓట్ల తేడాతో దేవెగౌడ పరాజయం పాలయ్యారు. 

అశోక్ చవాన్
మహారాష్ట్ర మాజీ సీఎం  అశోక్‌ చవాన్‌ బీజేపీ హవాను తట్టుకుని నిలబడలేకపోయారు. నాందేడ్‌ లో సిటింగ్‌ ఎంపీగా ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థి ప్రతాప్‌రావ్‌ చేతిలో చవాన్‌ 40వేల ఓట్లతో ఓడిపోయారు. 

ముకుల్ సంగ్మా
మేఘాలయ మాజీ సీఎం, కాంగ్రెస్‌ అభ్యర్థి ముకుల్‌ సంగ్మా తురా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అభ్యర్థి అగాథ సంగ్మా సుమారు 3లక్షల ఓట్ల మెజార్టీతో సంగ్మాపై విజయం సాధించారు. 

హరీష్ రావత్
ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ లీడర్‌ హరీశ్‌ రావత్‌ ఓటమి  పాలయ్యారు. నైనిటాల్‌-ఉద్దం సింగ్‌ నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌ భట్‌ ఓడించారు.

బాబూలాల్ మరాండీ
ఝార్ఖండ్‌ మాజీ సీఎం, ఝార్ఖండ్‌ వికాస్‌ మోర్చ(ప్రజాతాంత్రిక్‌) అభ్యర్థి బాబులాల్‌ మరాండీ..బీజేపీ అభ్యర్థి అన్నపూర్ణ దేవీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఝార్ఖండ్‌కు తొలి సీఎంగా పనిచేసిన బాబులాల్‌ 2006లో బీజేపీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ ప్రారంభించారు. 

శిబు సోరెన్
ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా అధ్యక్షుడు, మాజీ సీఎం శిబు సోరెన్‌ దుమ్కాలో బీజేపీ అభ్యర్థి సునీల్‌ సోరెన్‌ చేతిలో 47వేల ఓట్ల తేడాతో ఓటమిని ఎదుర్కొన్నారు. 

మెహబూబా ముఫ్తీ
జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం,పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అనంత్‌నాగ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అభ్యర్థి హస్నైన్‌ మసూదీ 10వేల ఓట్ల తేడాతో అనూహ్యంగా గెలుపొందారు. 

Modi
magic
lost
LOKSABHA ELECTION RESULTS
NDA
Congress
Leaders
Ex cm

మరిన్ని వార్తలు