ఈసీ క్లారిటీ : ఆటోలో ఈవీఎంల తరలింపు వాస్తవమే.. అయితే

Submitted on 16 April 2019
evms shifted in auto at jagtial, ec rajath kumar explonation

హైదరాబాద్ : జగిత్యాలలో ఈవీఎంలను ఆటోలో తరలించారని, ఈవీఎంల తరలింపులో ఈసీ ప్రొటోకాల్ పాటించలేదని వచ్చిన వార్తలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తీవ్రంగా స్పందించారు. అసలేం జరిగిందో వివరించారు. ఆటోలో ఈవీఎంల తరలింపుపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. ఆటోలో ఈవీఎంల తరలింపు వాస్తవమే అన్నారు. ఆ ఈవీఎంలు పోలింగ్ కు వాడినవి కాదన్నారు. అవి డెమో ఈవీఎంలు అని స్పష్టం చేశారు. ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చేందుకు వాటిని వాడారని రజత్ కుమార్ వివరణ ఇచ్చారు. ఆ డెమో ఈవీఎంలను ఆటోలో తరలించడం జరిగిందన్నారు. ఈ నిజం తెలుసుకోకుండా రచ్చ చేశారని, అనుమానాలు పుట్టించేలా దుష్ప్రచారం చేశారని రజత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్

ఈవీఎంలో 4 రకాల క్యాటగిరీలు ఉంటాయని రజత్ కుమార్ చెప్పారు. అందులో A, B కేటగిరీలకు చెందిన ఈవీఎంలు చాలా ముఖ్యమైనవి అన్నారు. A కేటగిరిలో ఉన్న ఈవీఎంలను పోలింగ్ కు వాడతారని చెప్పారు. అవి బంగారం కన్నా విలువైనవని, వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటామని తెలిపారు. రిప్లేస్ చేసిన ఈవీఎంలు B కేటగిరిలోకి వస్తాయన్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్పిప్పులపైనా సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రజత్ కుమార్ సీరియస్ అయ్యారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. కల్పిత కథనాల వల్ల అనుమానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈవీఎంలో లోపాలు ఉన్నాయనే ప్రచారాన్ని రజత్ కుమార్ ఖండించారు.

స్ట్రాంగ్ రూమ్స్ లో ఈవీఎంల భద్రతపై కొన్ని రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్న అనుమానాలను రజత్ కుమార్ కొట్టిపారేశారు. ఈవీఎంల భద్రతపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పారామిలటరీ బలగాలతో పహారా ఉంటుందన్నారు. రాష్ట్ర పోలీసులు కూడా ప్రొటెక్షన్ గా ఉంటారని వివరించారు.

జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఈవీఎంలను తరలించడం కలకలం రేపింది. అది కూడా ఆటోలో. అర్ధరాత్రి జగిత్యాల తహసీల్దార్ కార్యాలయానికి ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఈవీఎంలను తీసుకొచ్చారు. వీటిని ఆటోలో తరలిస్తుండగా గమనించిన స్థానికులు ఆటోను ఆపి ఆటోడ్రైవర్ ను నిలదీశారు. ఆ ఈవీఎంల తరలింపుపై ఆటో డ్రైవర్ పొంతన లేని సమాధానాలు చెప్పాడు. ఈవీఎంలు తరలిస్తున్న సమయంలో ఎన్నికల అధికారులు కూడా లేరు. ఎవరూ లేకుండా… ఈవీఎంలను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆటోలో వాటిని తరలిస్తుండగా ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అవి డెమో ఈవీఎంలు అని వాళ్లు చెబుతున్నా... డెమో ఈవీఎంలు అయినా.. ఇంత అర్ధరాత్రి పూట తరలించాల్సిన అవసరం ఏంటని స్థానికులు అనుమానించారు. ఈ వీడియో వైరల్ కావడంతో అనేక అనుమానాలు కలిగాయి. చివరికి సీఈవో రజత్ కుమార్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

evms
shifted
auto
Jagtial
Rajath Kumar
Telangana
EC
Election commission


మరిన్ని వార్తలు