ఎవరిపైన ద్వేషం, పక్షపాతం లేవు : అంబటి రాయుడు రిటైర్మెంట్ పై ఎమ్మెస్కే ప్రసాద్ స్పందన

Submitted on 21 July 2019
dont have anything against a particular player.. msk prasad

అంబటి రాయుడు రిటైర్ మెంట్ నిర్ణయం భారత క్రికెట్ జట్టులో దుమారం రేపిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడం చర్చకు దారి తీసింది. కొందరు ఫ్యాన్స్ రాయుడికి మద్దతుగా మాట్లాడారు. క్రికెట్ లో రాజకీయాలకు రాయుడిని బలి చేశారని వాపోయారు. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కారణంగానే రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడని విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై ఎమ్మెస్కే ప్రసాద్ ఫస్ట్ టైమ్ స్పందించారు. వెస్టిండీస్ టూర్ కు టీమిండియాను ఎంపిక చేసిన తర్వాత చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. రాయుడు చేసిన ట్వీట్, రిటైర్మెంట్ అంశాలపై తన అభిప్రాయం తెలిపారు.

క్రికెట్ వరల్డ్ కప్ కోసం నిష్పాక్షికంగా జట్టును ఎంపిక చేశామని ఎమ్మెస్కే చెప్పారు. అంబటి రాయుడు భావోద్వేగాలను అర్థం చేసుకున్నామని వివరించారు. జట్టు ఎంపికలో తమకు కొన్ని ప్రమాణాలు ఉంటాయన్నారు. ఏ క్రికెటర్ విషయంలోనూ తమకు ద్వేషం, పక్షపాతం లేవని స్పష్టం చేశారు. అంతేకాదు.. సెలెక్షన్ కమిటీ విజయ్ శంకర్ ను ఎంపిక చేయడంపై రాయుడు స్పందిస్తూ త్రీడీ కళ్లజోడు కొనుక్కుని వరల్డ్ కప్ చూస్తానంటూ చేసిన ట్వీట్ పైనా ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. ఆ ట్వీట్ ను తాను చాలా ఎంజాయ్ చేశానని అన్నారు. ''నిజంగా చెప్పాలంటే అది లవ్లీ ట్వీట్. నేను చాలా ఎంజాయ్ చేశాను"ఇక ధోనీ రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ, అది ఆయన వ్యక్తిగత విషయం అని ఎమ్మెస్కే తేల్చి చెప్పారు. 

వరల్డ్ కప్ కు టీమిండియా ఎంపిక సమయంలో అంబటి రాయుడు వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది. సెలెక్షన్ కమిటీ రాయుడిని కాదని.. విజయ్ శంకర్ ను ఎంపిక చేసింది. త్రీ డైమెన్షనల్ స్కిల్స్ ఉన్న కారణంగా విజయ్ శంకర్ అని సెలెక్ట్ చేశామని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పారు. ఈ నిర్ణయంతో రాయుడు హర్ట్ అయ్యాడు. ఎంతో అనుభవం ఉన్న తనను కాదని కావాలనే అనుభవం లేని క్రికెటర్ కి ఛాన్స్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయాడు. దీనిపై రాయుడు చాలా ఘాటుగా ట్వీట్ చేశాడు. త్రీడీ కళ్లజోడు కొనుక్కుని వరల్డ్ కప్ చూస్తాను అంటూ ఎమ్మెస్కేని ఉద్దేశించి ఏప్రిల్ 16న సెటైరికల్ ట్వీట్ వేశాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఏకంగా క్రికెట్ కే గుడ్ బై చెప్పేశాడు అంబటి రాయుడు.

msk prasad
BCCI
Ambati Rayudu
retirement
World Cup
Tweet
West Indies tour
dhoni

మరిన్ని వార్తలు