వైసీపీలో చేరతారా?: ఎమ్మెల్సీ పదవికి డొక్కా గుడ్ బై!

Submitted on 21 January 2020
Dokka Manikya Varaprasad resigns to his MLC Post

మూడు రాజధానుల విషయంలో ఎలాగైనా పంతం నెగ్గించుకునేందుకు వైసీపీ సర్కారు పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సులభంగానే దీనికి సంబంధించిన బిల్లులు గట్టెక్కినా.. శాసన మండలిలో మాత్రం కష్టమే. ఎందుకంటే మండలిలో వైసీపీకి బలం తక్కువగా ఉంది. అక్కడ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులే ఎక్కువ మంది ఉన్నారు. వీరంతా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పుడు సడన్‌గా టీడీపీ సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఎవరికీ అంతుపట్టని విధంగా తన పదవికి రాజీనామా చేసేశారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా తాను పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. అంతా బాగానే ఉంది. కానీ, అది టీడీపీ తీసుకున్న నిర్ణయం కాదు. అలాంటప్పుడు ఆ పార్టీలోనే ఉన్న వ్యక్తి పదవికి రాజీనామా చేయడం ఏంటంటూ జనాలు కొచ్చన్‌మార్క్‌ ఫేసులు పెడుతున్నారు. దీని వెనుక పెద్ద రహస్యమే ఉందని డిస్కస్ చేసుకుంటున్నారు.

డొక్కా గైర్హాజరుపై చర్చ :
తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపించారు డొక్కా మాణిక్య వరప్రసాద్‌. తొలిరోజు మండలి సమావేశానికి హాజరైన డొక్కా... రెండో రోజు హాజరు కాకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. ముందు రోజు రాత్రి వైసీపీ ముఖ్య నేతలు డొక్కా ఇంటికెళ్లి రాజధాని బిల్లుకు మద్దతివ్వాలని కోరారనే టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మండలి సమావేశాలకు డొక్కా గైర్హాజరు కావడంపై టీడీపీలో చర్చ మొదలైంది. మరో టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి కూడా సమావేశాలకు హాజరు కాలేదు. అయితే.. తాను అనారోగ్యం కారణంగానే హాజరు కాలేదని ఆమె చెబుతున్నారు. కానీ, డొక్క మాణిక్యవరప్రసాద్‌ మాత్రం ఏకంగా పదవికి రాజీనామా చేయడం సంచలనం అయ్యింది. ఇదంతా వైసీపీ ప్లాన్‌లో భాగమేనని అంటున్నారు.

యనమల ప్రకటన నిజమేనా? :
శాసనమండలిలో తొలి రోజు డొక్కాను సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆప్యాయంగా పలకరించడం, డొక్కా కూడా నవ్వుతూ జగన్‌తో మాట్లాడడం చూసిన వారికి చాలా అనుమానాలు మొదలయ్యాయి. డొక్కా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న ప్రచారం మొదలైంది. అధికారపార్టీ నేతలు తమ పార్టీ నేతలతో మాట్లాడారని మాజీ మంత్రి యనమల చేసిన ప్రకటన ఈ ఊహాగానాలకు తెర లేపుతోంది.

డొక్కా కూడా మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల నిర్ణయం పట్ల మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు.. ఇక మీదట ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. అంటే ఇలా చేయడం వల్ల ఆయనకు ప్రతిఫలంగా మళ్లీ ఎమ్మెల్సీ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది.

బిల్లు గట్టెక్కడానికేనా? :
శాసనమండలిలో టీడీపీతో పోల్చుకుంటే వైసీపీకి సంఖ్యా బలం తక్కువ. ఈ పరిస్థితుల్లో బిల్లు గట్టెక్కడానికి వ్యూహం ప్రకారం వైసీపీ ప్రభుత్వం అడుగులేస్తోందని అంటున్నారు. కొందరు టీడీపీ ఎమ్మెల్సీలతో మంతనాలు జరిపి, తమ వైపు తిప్పుకునేందుకు జగన్ సర్కార్ ఎత్తులు వేస్తోందని చెబుతున్నారు. మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో వీగిపోకుండా ఉండాలంటే బలం పెంచుకోవలసి ఉంటుంది. ఆ దిశగా వైసీపీ చేస్తున్న తొలి ప్రయత్నమే డొక్కా రాజీనామా అస్త్రం అనే టాక్‌ జోరందుకుంది.

మరోవైపు మండలి రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే ప్రచారం మధ్యాహ్నం నుంచి మొదలైంది. కేబినెట్‌లో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఎలాగో బలం ఉన్నందున మండలి రద్దు చేయాలని వైసీపీ భావిస్తోంది.

Dokka Manikya Varaprasad
MLC post
TDP
Ap Three capital issue
Ysrcp

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు