డిమాండ్లకు సీఎం మమత ఓకే : సమ్మె విరమించిన డాక్టర్లు

Submitted on 17 June 2019
doctors in west bengal calls off strike

డాక్టర్లతో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. వైద్యుల డిమాండ్లకు సీఎం అంగీకారం తెలిపారు. డాక్టర్లకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.  ఆసుపత్రుల్లో ఫిర్యాదులను స్వీకరించేందుకు నోడల్ అధికారిని నియమిస్తామన్నారు. 10 అంశాలతో కూడిన భరోసా ఇచ్చారు. సీఎం మమత హామీతో డాక్టర్లు సమ్మె విరమించారు. ఎన్ఆర్ఎస్ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్లపై రోగి బంధువులు దాడి చేయడంతో గొడవ మొదలుకాగా.. సమ్మెకి దిగిన జూనియర్ డాక్టర్లకి వైద్యులు మద్దతు తెలపడంతో బెంగాల్ సర్కార్ దిగొచ్చి చర్చలు జరిపింది.

ఎన్ఆర్ఎస్ ఆసుపత్రి వైద్యులతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన కార్యాలయం నబన్నలో చర్చలు జరిపారు. వారి డిమాండ్లను తీర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉందని సీఎం మమత హామీ ఇచ్చారు. ప్రభుత్వ హామీతో జూనియర్ డాక్టర్లు సంతృప్తి చెందారు. ఏదైనా సమస్య ఉంటే తనతో నేరుగా చెప్పాలని .. లేదంటే తన నివాసంలో గల డ్రాప్ బాక్స్‌లో లేఖ రాసి వేయాలని సూచించారు. లేఖలను తాను ప్రతిరోజు చూస్తానని చెప్పారు.

వైద్యుల రక్షణ కోసం ఓ నోడల్ ఆఫీసర్ ను నియమించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 6 రోజులుగా ఆందోళన చేస్తున్న ఏ వైద్యునిపై కూడా కేసు నమోదు చేయలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. గత సోమవారం ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో రోగి బంధువులు బీభత్సం సృష్టించారు. 200మంది ఆసుపత్రిలో హంగామా చేశారు. డ్యూటీ డాక్టర్స్ పై దాడి చేశారు. అప్పుడు మొదలైన రగడ 6 రోజుల పాటు సాగింది. డాక్టర్లు సమ్మెకి దిగారు. వారికి అన్ని రాష్ట్రాల్లోని వైద్య సంఘాలు మద్దతు తెలపడంతో మమత సర్కార్ దిగిరాక తప్పలేదు. అటు దేశ వ్యాప్తంగా డాక్టర్లు ఆందోళన విరమించారు.

Doctors
West Bengal
calls off
Strike
Mamata Banerjee
CM
Demands


మరిన్ని వార్తలు