
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో నిందితుల పోలీస్ కస్టడీపై సస్పెన్స్ కొనసాగుతోంది. నలుగురు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ శ్యాంప్రసాద్ ముందు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కేసును సమగ్ర దర్యాప్తు జరిపేందుకు వీలుగా పోలీస్ కస్టడీకి అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీనిపై షాద్‌నగర్ కోర్టు రెండు రోజుల పాటు విచారణ జరిపింది. అయితే... నిందితులను కస్టడీ తీసుకునే విషయం బయట తెలిస్తే శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసులు ఎలాంటి సమాచారాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు.
ప్రస్తుతం నిందితులు చర్లపల్లి మహానది బ్యారక్‌లో ఉన్నారు. వాళ్లను పోలీసులు ఎప్పుడు కస్టడీకి తీసుకుంటారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. నిందితుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టాల్సి ఉన్నందున పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును విజ్ఞప్తి చేశారు. నిందితులను కోర్టుకు తీసుకువచ్చే అవకాశం లేకపోవడంతో... వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు... నిందితులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. అంతే కాకుండా శిక్షలను తక్షణమే ఖరారు చేసి అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిందితుల తరఫున ఏ లాయర్ కూడా వాదించకూడదని బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానించింది. నిందితుల తరఫున వాదించేందుకు న్యాయవాదులెవరూ ముందుకు రాకపోవడంతో కస్టడీ ప్రక్రియకు ఆటంకం కలిగినట్లు తెలుస్తోంది. కోర్టుద్వారా న్యాయవాదులను నియమించుకుంటారా.. అనే విషయం తెలుసుకునేందుకు నిందితులకు కోర్టు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. పోలీసులు కోరినట్లుగా నిందితులను కోర్టు పది రోజుల పాటు కస్టడీకి ఇస్తుందా లేదా అనే విషయం 2019, డిసెంబర్ 04వ తేదీ బుధవారం తెలియనుంది.
అటు చర్లపల్లి జైలులో నిందితుల ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా నలుగురినీ వేర్వేరు బ్యారెక్స్లలో ఉంచినట్లు తెలుస్తోంది. నలుగురు కలిస్తే కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని విడివిడిగా విచారించడం వల్ల ప్రాసిక్యూషన్‌కు బలమైన సాక్ష్యాలు దొరుకుతాయని భావిస్తున్నారు. కస్టడీలో బయటపడే వివరాలతో నిందితులపై చార్జిషీట్ ఫైల్ చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read More : మనుషులేనా : దిశ రేప్ వీడియో కోసం తెగ వెదికారట