ఆపరేషన్ సక్సెస్ : బోటుని ఒడ్డుకి చేర్చిన ధర్మాడి సత్యం టీమ్

Submitted on 22 October 2019
dharmadi team takes out royal vasista boat 

ఆపరేషన్ వశిష్ట సక్సెస్ అయ్యింది. మంగళవారం(అక్టోబర్ 22,2019) మధ్యాహ్నం బోటుని వెలికితీసిన ధర్మాడి టీమ్.. ఎట్టకేలకు ఆ బోటుని ఒడ్డుకి చేర్చింది. వర్షం ఇబ్బంది పెట్టినా ధర్మాడి టీమ్ ఆగలేదు. ఆపరేషన్  ను కంటిన్యూ చేసింది. బోటుని వెలికితీసిన కొన్ని గంటలకే ఒడ్డుకి చేర్చారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బోటుని ఒడ్డుకి తీసుకొచ్చారు.

ధర్మాడి టీమ్ వేసిన ఉచ్చుకు చిక్కి బోటు నీళ్లపైకి తేలింది. ప్రమాదం జరిగిన 38 రోజుల తర్వాత బోటు బయటపడింది. రాయల్ వశిష్ట టూరిస్ట్ బోటు 51మంది ప్రాణాలు తీసుకుంది. ధర్మాడి సత్యం టీమ్ రెండు  విడతల్లో బోటు ఆపరేషన్ చేపట్టింది. డీప్ సీ డైవర్ల సాయంతో బోటుకి ఉచ్చు బిగించిన ధర్మాడి టీమ్.. దాన్ని వెలికితీసి ఒడ్డుకి చేర్చింది. సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత ఎట్టకేలకు బోటుని బయటకు తెచ్చింది ధర్మాడి  బృందం. 38 రోజుల పాటు నీటిలో నానడంతో.. బోటు పూర్తిగా ధ్వంసమైంది. ముక్కలు ముక్కలైంది.

కచ్చులూరు సమీపంలోని పాపికొండల దగ్గర సెప్టెంబర్ 15న పర్యాటక బోటు మునిగిపోయింది. ఆ రోజు ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున పర్యాటకులు వచ్చారు. వినోదం కోసం పాపికొండలకు  బయలుదేరారు. ఊహించని విధంగా బోటు ప్రమాదం జరిగింది. నదిలో వరద ఉధృతంగా ఉందని తెలిసినప్పటికీ... ప్రైవేట్‌ టూరిజం యజమానులు కాసుల కక్కుర్తితో బోటును నడిపించారు. కచ్చులూరు దగ్గర  సుడిగుండాలు ఉంటాయని తెలిసినా... గోదావరిపై పట్టులేని, అనుభవం లేని డ్రైవర్లకు బోటును అప్పగించారు. వరద ప్రవాహంలో గోదావరిపై వెళ్తున్న బోటును కట్టడి చేసేందుకు అధికారులు కూడా ప్రయత్నించలేదు.  అందరూ కలిసి పర్యాటకుల్ని ప్రమాదంలోకి నెట్టేశారు.

ఆ రోజు బోటులో మొత్తం 77 మంది పర్యాటకులు ఉన్నారు. స్థానికుల సాయంతో 26 మంది సురక్షితంగా బయటపడగా... 51 మంది గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది గాలింపు  చర్యలు చేపట్టారు. బోటు ప్రమాదంలో ఇప్పటివరకు 39 మృతదేహాలు లభించడంతో బంధువులకు అప్పగించారు. మంగళవారం(అక్టోబర్ 22,2019) బోటుతో పాటు 5 మృతదేహాలు బయటపడ్డాయి. ఇంకా 7 మృతదేహాల ఆచూకీ తెలియాల్సి ఉంది.

బోటు వెలికితీత ఆపరేషన్ లో ధర్మాడి సత్యం టీమ్ తీవ్రంగా శ్రమించింది. ఓ దశలో బోటు వెలికితీత ప్రయత్నాలు విరమించుకుంది. పట్టువదలని విక్రమార్కుడిలా ధర్మాడి సత్యం ప్రయత్నాలు చేశారు. చివరికి సక్సెస్ అయ్యారు.

Royal Vasista
BOAT
dharmadi satyam
Godavari
kachuluru
boat extraction

మరిన్ని వార్తలు