దేవ్ - మూవీ రివ్యూ

Submitted on 14 February 2019
Dev Movie Review-10TV

హీరో కార్తి.. పేరుకు తమిళ్ హీరో అయినా.. తెలుగులోనూ అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. దానికి కారణం అతను ఎంచుకుంటున్న కథాబలం ఉన్న సినిమాలు. కార్తి ఏదైనా సినిమా చేశాడు అంటే.. దాన్లో ఏదైనా ఒక మంచి ఎలిమెంట్ ఉంటుంది అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. దీనికి తోడు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించడం, టాప్ రేటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చెయ్యడం, ట్రైలర్స్, ఎగ్జైటెడ్‌గా ఉండడంతో, కార్తి నటించిన దేవ్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వాలంటైన్స్‌ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ని ఎగ్జైట్ చేసిందా, లేక ఎగ్జిట్ వైపు చూసుకునేలా చేసిందా? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ విషయానికొస్తే.. దేవ్‌కి చిన్నప్పటి నుంచి ఎడ్వెంచర్స్ చెయ్యడం అంటే ఇష్టం. అలాంటి దేవ్ ఫస్ట్ టైమ్ .. మేఘనను చూసి ఎడ్వెంచర్స్ నుంచి లవ్ వైపు టర్న్ అవుతాడు. కానీ మేఘన జీవితంలో జరిగిన సంఘటనల వల్ల తనకు మగాళ్ల వల్ల ద్వేషం కలుగుతుంది. దాంతో దేవ్‌ని నమ్మదు.. దూరంగా ఉంచుతుంది. కానీ, అతని సిన్సియారిటీ, అటెన్షన్ చూసి ఇష్టపడుతుంది. అయితే మేఘనకి సర్‌ప్రైజ్ ఇద్దామనుకుని దేవ్ చేసిన ఒక పని వల్ల మనస్పర్థలు వచ్చి ఇద్దరూ విడిపోతారు. తిరిగి వాళ్లిద్దరూ ఎలా కలుసుకున్నారు అనేది సినిమా కథ.

నటీనటుల విషయానికొస్తే.. ఇప్పటి వరకూ తాను నటించిన ప్రతి సినిమాలో పక్కింటి అబ్బాయిలా న్యాచురల్ లుక్స్‌తో, టైమింగ్ ఉన్న యాక్టింగ్‌తో అలరించిన కార్తి.. దేవ్ సినిమా విషయానికొచ్చేసరికి అడుగడుగునా కథలో ఉన్న కన్‌ఫ్యూజన్‌తో, డైరెక్టర్ చెప్పిందల్లా చేసుకుని వెళ్లిపోయాడు. కార్తి స్టైలింగ్ బాగానే ఉన్నా.. డ్యాన్సు, ఫైట్లు కష్టపడి చేసినా.. నటనపరంగా నిరాశపరిచాడు. చాలా కాలం తర్వాత దేవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రకుల్ ప్రీత్‌ని చూస్తే.. ఆశ్చర్యమేస్తుంది. ఫేస్‌లో ఏమాత్రం గ్లో లేదు. ఎక్స్‌ప్రెషన్స్ కూడా .. ఏదో ఫస్ట్ సినిమాలా అరకొరగా ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల అసలు ఈమె రకులే నా... అనిపిస్తుంది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ లాంటి నటదిగ్గజాలు పేరుకే తప్ప, దేనికీ ఉపయోగపడలేదు. హీరో ఫ్రెండ్స్‌గా నటించిన క్యారెక్టర్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

టెక్నీషియన్స్ విషయానికొస్తే.. ఈ సినిమా డైరెక్టర్ రజత్ రవిశంకర్, అసలు.. ఏ పాయింట్ మీద కథ మొదలుపెట్టాడు.. ఎటునుంచి ఎటు వెళ్లాడు.. సినిమాని ఎలా కన్ క్లూడ్ చేశాడు.. అనేది ఆలోచిస్తే.. బుర్ర హీట్ ఎక్కడం ఖాయం. అర్థం, పర్దం లేని కథ, అస్తవ్యస్తమైన స్క్రీన్ ప్లే , దారుణమైన డైరెక్షన్‌తో దేవ్ సినిమా చూడడమే పెద్ద సాహసం అనిపించేలా మలిచాడు. సినిమా పూర్తిగా చూడాలంటే చాలా ఓపిక ఉండాలి అనిపించేలా అవుట్ పుట్ ఇచ్చాడు డైరెక్టర్. ఎలాంటి పాత్రనైనా హ్యాండిల్ చెయ్యగల సత్తా ఉన్న నటీనటులను పక్కనపెట్టుకుని, సినిమాలో ఒక్కసీన్ కూడా బాగుంది అనేలా మలచలేకపోయాడు. రైటింగ్ స్టేజ్ నుంచే ఈ సినిమా పూర్తిగా అవుట్ ఆఫ్ ట్రాక్‌లోకి వెళ్లిపోయిందనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.

హరీష్ జయరాజ్ కూడా అవుట్ పుట్‌కి తగ్గట్టు సో..సో.. గా అనిపించే మ్యూజిక్‌తో సరిపెట్టేశాడు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్న వేల్ రాజ్ మాత్రం.. సినిమాకి రిచ్ లుక్ రావడానికి చాలా కష్టపడ్డాడు. నిర్మాతలు కార్తిని నమ్మి, ఖర్చుకు వెనకాడకుండా.. రిచ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. ప్రొడక్షన్ వాల్యూసే సినిమాకి హైలెట్.
ఓవరాల్‌గా మంచి బజ్‌తో, మంచి గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవ్.. కంటెంట్ పరంగా కాస్తైనా మెప్పించి ఉంటే.. తేలిగ్గా గట్టెక్కేది. కానీ.. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా.. అడుగడుగునా స్పీడ్ బ్రేకర్స్‌ లాంటి కుదుపులతో, సినిమా చూడడమే ఓ అడ్వెంచర్ అనిపించేలా.. ఉన్న దేవ్, ఏవర్గం ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేకపోయిందని చెప్పొచ్చు.

ప్లస్
ప్రొడక్షన్ వాల్యూస్
స్టైలింగ్
సినిమాటోగ్రఫీ

మైనస్
అస్తవ్యస్తమైన కథ
స్క్రీన్ ప్లే, పాటలు
డైరెక్షన్ , డైలాగ్స్

Dev
Karthi
Rakul Preet Singh
Harris Jayaraj
Rajath RaviShankar

మరిన్ని వార్తలు