ఆస్తుల కోసం నా మొదటి భార్య వేధిస్తోంది : దాసరి పెద్ద కొడుకు ఆవేదన

Submitted on 19 June 2019
dasari prabhu worries about first wife

దర్శకరత్న, దివంగత దాసరి నారాయణ రావు పెద్ద కొడుకు దాసరి ప్రభు ఆచూకీ లభ్యమైంది. కొన్ని రోజులుగా అదృశ్యమైనట్టు భావిస్తున్న ఆయన బుధవారం (జూన్ 19,2019) హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. గతవారం దాసరి ప్రభు అదృశ్యమైనట్టు ఆయన మామ జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇంటికి చేరుకున్న దాసరి ప్రభుని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎందుకు అదృశ్యమయ్యారు? ఎక్కడికి వెళ్లారు? అన్న విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ సందర్భంగా దాసరి ప్రభు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన మొదటి భార్య వేధిస్తోందని చెప్పారు. ఆస్తుల కోసం మానసికంగా టార్చర్ పెడుతోందని వాపోయారు. మొదటి భార్యతో ఉన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు ఆమె దగ్గరికి వెళ్లానని చెప్పారు. తన భార్య తన నుంచి బంగారం, విలువైన వస్తువులు లాక్కుందన్నారు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ప్రభు చెప్పారు. తన భార్య వారంపాటు చిత్తూరు, ముంబై, హైదరాబాద్ తిప్పిందని ప్రభు తెలిపారు. పోలీసులు ట్రాప్ చేస్తారనే ఉద్దేశంతోనే తనను తిప్పిందన్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో తాను ఉన్నానని చెప్పారు.

ఎంతోమంది సమస్యలను మా నాన్న పరిష్కరించారని గుర్తు చేసిన దాసరి ప్రభు.. మా సమస్యలను సినీ పెద్దలు పరిష్కరించడం లేదన్నారు. తన తమ్ముడితో ఆస్తి వివాదాలు ఇంకా ఉన్నాయన్నారు. సినీ పరిశ్రమ నుంచి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని దాసరి ప్రభు వాపోయారు. పోలీసులే తనకు న్యాయం చేయాలని కోరారు. 

dasari prabhu
Missing
found
first wife
family
problems


మరిన్ని వార్తలు