జగన్ గెలిచినా చంద్రబాబే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు

Submitted on 15 April 2019
dadi veerabhadra rao satires on cm chandrababu

విశాఖ : వైసీపీ నేత దాడి వీరభద్రరావు ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఎన్నికల్లో జగన్ గెలిచినా.. చంద్రబాబే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని, తానే ఏపీ సీఎం అని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. జగన్ గెలుపుని చంద్రబాబు అంగీకరించరు అని అన్నారు. జగన్ గెలుపు గెలుపే కాదు, నేనే ముఖ్యమంత్రిని అని చంద్రబాబు అంటారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన రోజునే చంద్రబాబు కూడా ఏదో ఒక చోట ప్రమాణస్వీకారం చేసి అనధికారికంగా నేనే ముఖ్యమంత్రిని అని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకునే స్థాయికి చంద్రబాబు వెళతారని దాడి విమర్శించారు.

తన ఓటమికి సాకులు చూపడానికే చంద్రబాబు ఈవీఎంలపై రగడ చేస్తున్నారని దాడి ఆరోపించారు. ఒకప్పుడు టీడీపీని వ్యతిరేకించిన వారందరిని చంద్రబాబు కలుస్తున్నారని, ఇది బాధాకరం అని దాడి అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా కేసు వేసి అప్రతిష్ట పాలు చేయడానికి యత్నించిన కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ తో కలిసి చంద్రబాబు తిరగడం దారుణం అన్నారు. డేటా చోరీ చేసిన ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ ను చంద్రబాబే దాచి పెట్టారని దాడి ఆరోపించారు. డేటా చోరీ దేశ ద్రోహం అని, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి, ఎంతకి అమ్ముకున్నారని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈవీఎంలపై చంద్రబాబు ఆరోపణలను దాడి ఖండించారు. చంద్రబాబు తన హోదాని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని కామెంట్ చేశారు.

ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలియడంతో ఆ నెపాన్ని ఎవరిపై నెట్టాలా అని చంద్రబాబు చూస్తున్నారని దాడి వీరభద్రరావు విమర్శించారు. ఎన్నికల సంఘం లాంటి రాజ్యాంగ వ్యవస్థలను విమర్శిస్తే చంద్రబాబుకి కలిగే లాభం ఏంటో అర్థం కావడం లేదన్నారు. 2014లో ఇవే ఈవీఎంలతో గెలిచిన ఆయన.. ఇప్పుడు వాటిపై ప్రజలను ఎందుకు గందరగోళానికి గురి చేస్తున్నారని దాడి ప్రశ్నించారు.

dadi veerabhadra rao
satires
Chandrababu
Ys Jagan
Ysrcp
TDP
evms

మరిన్ని వార్తలు