కుమ్మేయాలి : వరల్డ్ కప్ లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పై ఉత్కంఠ

Submitted on 16 June 2019
cricket world cup, india vs pakistan

నిరీక్షణకు తెరపడింది. రోజంతా టీవీలకు అతుక్కుపోయే సందర్భం వచ్చేసింది. భారత్‌, పాక్‌ అభిమానులే కాదు.. క్రికెట్‌ ప్రపంచమే అత్యంత ఆసక్తిగా ఉద్విగ్నంతో మునివేళ్ల మీద నిలబడే సమయం ఆసన్నమైంది. ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థులైన భారత్‌, పాకిస్థాన్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఏడో మ్యాచ్‌లో కూడా పాక్‌ను మట్టి కరిపించాలని టీమిండియా పట్టుదలగా ఉంటే... వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఒక్క మ్యాచ్‌లోనైనా భారత్‌పై గెలవాలని పాకిస్థాన్‌ ఆరాటపడుతోంది.

క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో అసలు సిసలైన యుద్ధానికి సమయం వచ్చింది. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సమరానికి తెర లేవనుంది. మాంచెస్టర్‌ వేదికగా మధ్యాహ్నం 3గంటలకు దాయాదుల మధ్య పోరు జరగనుంది. ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ పాకిస్థాన్ లు ఆరు మ్యాచుల్లో తలపడగా... అందులో భారత్ ఆరుకి ఆరుసార్లు గెలిచి రికార్డు నెలకొల్పింది. దీంతో పాకిస్థాన్‌కు వరల్డ్ కప్ లో భారత్‌పై గెలవడం అనేది ఒక తీరని కోరికగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో గెలుపు కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవ్వగా... కోట్లాది మంది అభిమానులు తమతమ దేశాల గెలుపు కోసం ప్రార్థనల్లో మునిగిపోయారు.

యావత్‌ క్రికెట్‌ ప్రపంచంలో భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజే వేరు. ఇరు దేశాల అభిమానులు మైదానంలో జరుగుతున్న ఓ యుద్ధంలా చూస్తారు. ఇక అది ప్రపంచకప్‌ మ్యాచ్‌ అయితే టీవీలకే అతుక్కుపోతారు. తామే మైదానంలో యుద్దం చేస్తున్నట్లు ఫీలవుతారు. ప్రతికూల ఫలితాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేరు. తమ దేశం గెలవాలంటే తమ దేశం గెలవాలని కోరుకుంటారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రస్తుతం భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న మ్యాచ్‌ను ఇరు దేశాల అభిమానులు, ఆటగాళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రౌండ్‌లో క్రికెటర్లపై ఎంత ఒత్తిడి ఉందో... బయట అభిమానులు కూడా అంతే ప్రెజర్‌ ఫీలవుతున్నారు. టీమిండియా గెలవాలంటూ దేశవ్యాప్తంగా పూజలు చేస్తున్నారు అభిమానులు. కొహ్లీ సేన విజయం కోసం వారణాసిలోని గంగా తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానికులు.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌పై భారత ఫ్యాన్స్‌లో భావోద్వేగం పొంగిపొర్లుతున్నా... తమ దృష్టి మాత్రం ప్రపంచకప్‌ గెలవడంపైనే ఉందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. తమ ప్రదర్శన బాగున్నా లేకున్నా జీవితానికి ఇదేమీ అంతం కాదన్నాడు. మ్యాచ్‌లో బాగా ఆడినా ఆడకున్నా దీంతో ఏమీ ముగిసిపోదని స్పష్టం చేశాడు. 

వరల్డ్‌కప్‌ను వెంటాడుతున్న వరుణుడు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మాంచెస్టర్‌లో జరిగే మ్యాచ్‌ను కూడా వదిలేలాలేడు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకూ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా. అంటే సరిగ్గా మ్యాచ్‌ జరిగే సమయమన్నమాట. దీంతో ఐసీసీతో పాటు అభిమానుల్లో కూడా టెన్షన్‌ నెలకొంది. వరుణుడు అడ్డుపడకుండా మ్యాచ్‌ పూర్తి ఓవర్లు కొనసాగితే పర్లేదు. ఒకవేళ వర్షం వల్ల ఓవర్లను కుదిస్తే.. అందుకు తగ్గట్టు భారత్‌, పాకిస్థాన్‌ జట్లలో ఒకటి, రెండు మార్పులు తప్పకపోవచ్చు. 

మ్యాచ్‌ కనుక 35 ఓవర్లకు తగ్గిస్తే.. విజయ్‌ శంకర్‌కు బదులు దినేశ్‌ కార్తీక్‌ పట్లే టీమిండియా యాజమాన్యం మొగ్గుచూపే అవకాశముంది. అలాగే పాక్‌ బ్యాట్స్‌మెన్‌ స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోనుండడంతో పాటు ఆ జట్టు టాప్ ఆర్డర్‌లో ముగ్గురు ఎడమచేతి ఆటగాళ్లు బరిలోకి దిగే చాన్స్‌ ఉంటుంది. దాంతో మబ్బులు కమ్మిన వాతావరణంలో కుల్దీప్‌కు బదులు షమీ ఆడే అవకాశముంది. ఇకపోతే పేసర్‌ షహీన్‌ అఫ్రీదికి బదులు రిస్ట్‌ స్పిన్నర్‌ షాదాబ్‌ ఖాన్‌ పాక్‌ జట్టులోకి వచ్చే చాన్సుంది. పిచ్‌పై పెద్దగా తడి లేకపోవడంతో నలుగురు పేసర్లతో పాకిస్థాన్‌ బరిలోకి దిగకపోవచ్చు.

మరోవైపు ఇంగ్లండ్‌లోని వాతావరణ పరిస్థితులు... అక్కడ జరుగుతున్న ప్రపంచకప్‌ టోర్నీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మెగా టోర్నీ ప్రారంభమైన రెండు వారాల నుంచి ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఈ మ్యాచ్‌లకు కలిపి నిర్వాహకులకు రూ.180 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇక భారత్‌, పాక్‌ మధ్య జరగబోయే మ్యాచ్‌పై వర్ష ప్రభావం కొనసాగితే దాని నష్టం భారీ మొత్తంలో ఉంటుంది. ఈ ఒక్క మ్యాచ్‌పైనే రూ.137 కోట్ల వ్యాపారం జరగుతోంది. ప్రపంచకప్‌ టోర్నీ ప్రసారాలను సొంతం చేసుకున్న స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌ ఈ నష్టాలను అధిక మొత్తంలో భరించాల్సిన పరిస్థితి ఉంది.

cricket
World Cup
india
Pakistan
History
Virat Kohli
Team India
Match
icc

మరిన్ని వార్తలు