హానీ ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్టు

Submitted on 15 November 2019
cops arrested honey trap gang at east godavari district

తూర్పు గోదావరి జిల్లాలో హానీ ట్రాప్ జరిగింది. జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని, యువతితో హానీ ట్రాప్ చేయించి అతని వద్దనుంచి డబ్బు వసూలు చేస్తూ ఘరానా మోసానికి పాల్పడిన ముఠాను సామర్లకోట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దుర్గారెడ్డి  పరారీలో ఉండగా రాకేష్‌ అనే వ్యక్తితో పాటు మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వివరాల్లోకి వెళితే .. ముఠాకు చెందిన రాకేష్‌ భార్య అశ్వినితో గొల్లలమామిడాడకు చెందిన మణికంఠరెడ్డి అనే వ్యక్తిని హానీ ట్రాప్‌ చేయించారు. అతడితో ఆమె పరిచయం పెంచుకునేలా ప్లాన్ చేసి అమలు చేశారు. ఈ క్రమంలో వారిద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు ముఠాకు చెందిన వ్యక్తులు వీడియోలు చిత్రీకరించారు.అనంతరం ఆ నగ్న వీడియోను మణికంఠకు చూపించి బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టారు. వ్యవహారం సెటిల్ చేసుకుందాం రమ్మని పిలిచి..అతడిని కిడ్నాప్‌ చేసారు.

మణికంఠరెడ్డి వద్దనుంచి దాదాపు 63 వేల రూపాయల విలువైన ఆభరణాలు దోచుకున్నారు. అతడితో ప్రాంశరీ నోట్లు, డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారు. ఈ క్రమంలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు ముఠాకు చెందిన రాకేష్ తో పాటు  సహకరించిన ఏడుగురిని అరెస్టు చేశారు. కాగా ఈ ముఠాలో ప్రధాన నిందితుడైన దుర్గారెడ్డి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

HONEY TRAP
East Godavari District

మరిన్ని వార్తలు