యాత్ర క్లైమాక్స్ : జగన్ సంచలన ప్రకటన ఏంటి!

Submitted on 29 December 2018
Ys Jagan Mohan Reddy, Praja Sankalpa Yatra, Srikakulam Ys jagan public meeting, Ysrcp

జగన్.. సంకల్ప యాత్ర క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. మరో 15 రోజుల్లో ముగియనుంది. ఇడుపులపాయ టూ ఇచ్చాపురం వరకు సాగిన పాదయాత్ర 331 రోజులు సాగింది. 3వేల 500 కిలోమీటర్ల నడిచారు. ఇన్నాళ్లు.. ఇంత దూరం నడిచి క్లైమాక్స్‌ తుస్సుమంటే బాగుంటుందా చెప్పండి.. అబ్బే అస్సలు బాగోదు. అందుకే ముగింపు సభను గ్రాండ్‌గా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. లక్ష మందితో సత్తా చాటాలని డిసైడ్ అయిన పార్టీ.. బహిరంగ సభ వేదిక నుంచి సంచలన ప్రకటనకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
సంచలన ప్రకటన ఏంటి!
ప్రజా సంకల్ప యాత్ర ముగింపు బహిరంగ సభలో జగన్ ప్రసంగంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టింది పార్టీ. అద్భుతంగా ఉండాలని నిర్ణయించింది.. అందుకు తగ్గట్టుగా మెరుపులు కూడా చూసుకుంటోంది. కచ్చితంగా జగన్ సంచలన ప్రకటన చేస్తారని పార్టీ నేతలు గట్టిగా చెబుతున్నా.. అది ఏంటి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు. దీనిపై ఊహాగానాలు మాత్రం బోలెడు ఉన్నాయి. పొత్తుల విషయంపై అని ఒకరు అంటే.. అభ్యర్థుల ప్రకటన అని మరికొందరు అంటున్నారు. 2019 ఎన్నికలపైనే ఈ ప్రకటన ఉంటుందని చెబుతూనే.. అది ఏమైనా కావొచ్చు.. ఏ విధంగా అయినా ఉండొచ్చు.. మీరు మాత్రం ఊహించనిది అంటూ మీడియాను ఊరిస్తున్నారు వైసీపీ నేతలు.
12 జిల్లాలు, 3వేల కిమీ:
జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఆయన తన పాదయాత్రను ముగించబోతున్నారు. ప్రజా సమస్యలు అధ్యయనం చేయడంతోపాటు వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం ప్రధాన లక్ష్యంగా ప్రజా సంకల్పయాత్ర పేరుతో జగన్ పాదయాత్ర ప్రారంభించారు. 2017, నవంబర్‌ 6వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. అయితే పాదయాత్రను జనవరి 9న లేదా 10న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగించనున్నారు. ఇప్పటి వరకు 12 జిల్లాల్లో ముగిసిన పాదయాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 331 రోజులుగా పాదయాత్ర చేస్తున్న జగన్‌.. దాదాపు 3539 కిలోమీటర్లు నడిచారు. ఈ పాదయాత్రలో భాగంగా 132 నియోజకవర్గాలను తన పాదయాత్ర ద్వారా టచ్‌ చేశారు. ఈ సుదీర్ఘ పాదయాత్రలో 123 బహిరంగ సభల్లో జగన్‌ ప్రసంగించారు. పాదయాత్ర ముగిసేనాటికి దాదాపు 3650 కిలోమీటర్లకు చేరుకునే అవకాశముంది.
కీలక ఘట్టాలు:
ఏడాదికిపైగా సాగిన జగన్‌ పాదయాత్ర అనే కీలక ఘట్టాలను దాటి ముగింపు దశకు చేరుకుంది. జనవరి 2న చిత్తూరు జిల్లా మదనపల్లిలో జగన్‌ పాదయాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 28న ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 100 రోజుల మైలురాయిని దాటింది. మే ఫస్ట్‌ను కృష్ణా జిల్లా పెడనలో 150 రోజులు కంప్లీట్‌ చేసుకుంది. ఇక 200వ రోజును జూన్‌ 27న తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో క్రాస్‌ చేసింది. ఆగస్టు 30న విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో 250వ రోజును చేరుకున్నారు. నవంబర్‌ 18న జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో 300 రోజుల మైలురాయిని అధిగమంచింది.
పాదయాత్రతో చరిత్ర:
జగన్‌ పాదయాత్ర ప్రస్తుతం 3539 కిలోమీటర్లు పూర్తయ్యింది. అయితే అనేక మైలురాళ్లను దాటుకుంటూ జగన్‌ పాత్ర ఇక్కడికి చేరుకుంది. జగన్‌ పాదయాత్ర 100 కిలోమీటర్ల మైలురాయిని కర్నూలు జిల్లా  ఆల్లగడ్డలో అధిగమించింది. ఇక ధర్మవరంలో 500 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 1000 కిలోమీటర్లను క్రాస్‌ చేసింది. 1500 కిలోమీటర్లను గుంటూరు జిల్లా పొన్నూరులో అధిగమించింది. ఏలూరు దగ్గర 2వేల కిలోమీటర్ల మైలురాయిని జగన్‌ దాటారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో 2500 కిలోమీటర్ల మైలురాయిని క్రాస్‌ చేశారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోట దగ్గర 3వేల కిలోమీటర్లను దాటి చరిత్ర సృష్టించారు. ఇక శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 3500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.
లక్షమందితో ముగింపు సభ:
జగన్‌ పాదయాత్ర ముగింపుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఇందుకోసం పైలాన్‌ నిర్మాణం వేగవంతంగా జరుగుతోంది. పాదయాత్ర ముగింపు సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు వైసీపీ నాయకత్వం ప్లాన్‌ చేస్తోంది. ఈ సభకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ చేస్తున్నారు. దాదాపు లక్ష మందితో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పాదయాత్ర ముగింపు సభలో జగన్‌ కీలక ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలతోపాటు మరికొన్ని ఎన్నికల హామీలను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

Ys Jagan Mohan Reddy
Praja Sankalpa Yatra
Srikakulam Ys jagan public meeting
Ysrcp

మరిన్ని వార్తలు