మళ్లీ అదే చెప్పారు : ఏపీ అసెంబ్లీ స్థానాలు పెంచం

Submitted on 19 December 2018
no increase in ap and telangana places

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యం కాదని కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల విభజన నాటి నుండి రెండు రాష్ట్రాల సీఎంలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో నియోజకవర్గాలను పెంచాలనే ఆలోచనతో కేంద్రప్రభుత్వం వద్ద ప్రతిపాదనను పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై పార్లమెంట్ సమావేశాలలో కోరుతునే వున్నారు. అసెంబ్లీ స్థానాల పెంపుపై..డిసెంబర్ 19న రాజ్యసభలో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యం కాదని లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పారు. 2026 వరకు స్థానాలను పెంచడం కుదరదని కుండబద్దలు కొట్టేసింది. 
‘ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 తర్వాత సేకరించే తొలి జనాభా లెక్కల ప్రకారమే.. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు ఉంటుందని చెప్పారు. అలాగే విభజన చట్టం 12వ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలన్నీ ఏపీకి అమలు చేశామని.. టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు సమాధానం ఇచ్చారు గంగారాం. 

ఏపీ విభజన అనంతరం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచాలనే డిమాండ్ వచ్చింది. తెలంగాణలోని 119 స్థానాలను 153కు.. ఏపీలోని 175 స్థానాలను 225కు పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014లో కూడా పేర్కొన్నారు. అలాగే సీఎంలు కేసీఆర్‌, చంద్రబాబులు.. స్థానాలను పెంచాలని ఎప్పటి నుంచో కేంద్రాన్ని కోరుతున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా పెంపు సాధ్యమవుతుందని.. కేంద్రం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోందని గతంలో ప్రచారం జరిగింది. కాని స్థానాలను పెంచడం సాధ్యం కాదని కేంద్రం మళ్లీ తేల్చి చెప్పేసింది. 


మరిన్ని వార్తలు