న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్ కమ్ 

Submitted on 1 January 2019
grand welcome to new year 2019

హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ధూమ్ ధూమ్ గా జరిగాయి. 2019కి గ్రాండ్ గా వెల్ కమ్ పలికారు. రోజంతా యువత హంగామా చేశారు. బాణ సంచా పేలుళ్లు...డీజే చప్పుళ్లతో నగరం హోరెత్తింది. కొత్త సంవత్సరానికి నగర ప్రజలు ఘన స్వాగతం పలికారు. మద్యం ఏరులై పారింది. మద్యం అమ్మకాలు భారీగా సాగాయి. 

సోమవారం ఉదయం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు నగరమంతా పండుగ వాతావరణం కనిపించింది. అర్ధరాత్రి 12 గంటలకు జనం రోడ్లపైకి వచ్చి హ్యాపీ న్యూయిర్ అంటూ కేరింతలు చేశారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులతో కలిసి నూతన సంవత్సర ఆనందాన్ని పంచుకున్నారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. న్యూ ఇయర్ సంబరాల్లో మునిగి తేలారు.  

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సుమారు 150కి పైగా మెగా ఈవెంట్స్ జరిగినట్లు  పోలీసులు, ఆబ్కారీశాఖ అంచనా వేశాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో పాశ్చాత్య బాణీలు, బాలీవుడ్, హాలీవుడ్ సంగీత విభావరి, మ్యూజికల్ నైట్స్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉర్రూతలూగారు. ఈవెంట్స్ నిర్వహకులు ఎల్ ఈడీ కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందేలా డ్యాన్స్ ఫ్లోర్లు, ప్రత్యేకంగా అలంకరించిన వేడుకలను సిద్ధం చేయడం విశేషం. 

నగరంలోని స్టార్ హోటళ్లు, థీమ్ పార్కులు, క్లబ్ లు, పబ్ లు, బార్ ఆండ్ రెస్టారెంట్స్ తోపాటు రిసార్టుల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, శామీర్ పేట్, మేడ్చల్, శంషాబాద్, మొయినా బాద్, గండిపేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట్, గ్రీన్ ల్యాండ్స్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చి ఆకాశాన్ని మిరిమిట్లు కొలిపారు.

ఇక ఈవెంట్ల నిర్వహకులు దేశ, విదేశీ వంటకాలు, స్టార్టర్స్ తో పాటు వివిధ రకాల మద్యం, సాఫ్ట్ డ్రింక్స్ ను ఆఫర్ చేశారు. కొత్త సంవత్సరం వేడుకల్లో ఈసారి మద్యం ఏరులైపారింది. వైన్, రమ్, ఓడ్కా, బీరు అన్న తేడా లేకుండా మహానగర పరిధిలోని 400 మద్యం దుకాణాలు, 500పైగా బార్లలో మద్యం విక్రయాలు భారీగా సాగాయి. 
 

grand welcome
New year 2019
Hyderabad
youth
celebrations
Hotels

మరిన్ని వార్తలు