అవార్డు చిత్రాల దర్శకుడు కన్నుమూత

Submitted on 30 December 2018
Award films director, Mrinal Sen passes away

కోల్‌కతా : భారతీయ చలన చిత్ర చరిత్రలో అత్యున్నత దర్శకులుగా చెప్పదగిన ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన  ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. మృణాల్ సేన్ మృతి పట్ల  పశ్చిమ  బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. వయస్సు పెరిగిన రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలతో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

1923 మే 14న బంగ్లాదేశ్ లోని ఫరీద్ పూర్ లోజన్మించిన మృణాల్ సేన్ అక్కడే పాఠశాల విద్యనభ్యసించిన అనంతరం కొల్ కత్తా కు వచ్చారు. స్కాటిష్  చర్చి కాలేజీలో చదివారు. కోల్కతా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1955లో "రాత్ భోరె" చిత్రంతో దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.1983లో కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించగా, 2005లో ఆయనకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. 
ఆయన సినిమాలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడ్డాయి.

అంతర్జాతీయ స్థాయిలో బెర్లిన్, కేన్స్, వెనిస్, మాస్కో, మాంట్రియల్, చికాగో, కైరో వంటి అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పలుమార్లు  ప్రతిష్ఠాత్మక పురస్కారాలు పొందారు. 1969 లో ఆయన తీసిన భువన్ షోమ్  సినిమా ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. భువన్ షోమ్ ద్వారా తొలిసారి జాతీయ పురస్కారాల్లో ఉత్తమ దర్శకునిగా అవార్డు అందుకున్నారు. 2002లో వచ్చిన ఆమర్ భువన్  మృణాల్ సేన్ చివరి సినిమా. కలకత్తా 71, ఇంటర్వ్యూ (1971), ఖాందహార్ (1974), కోరస్ (1975), మృగయ (1977), అకలేర్ సాంధనె (1981), ఏక్ దిన్ అచానక్ (1989)లాంటి సినిమాలను ఆయన తెరకెక్కించారు. ప్రపంచ సినిమా స్ధాయికి బెంగాలీ సినిమాను తీసుకెళ్లిన మృణాల్ సేన్ మరణంతో ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

Mrinal Sen
West Benagal film industry
Bhuvan Shome
Mrigayaa
Mrinal Sen passed away

మరిన్ని వార్తలు