బాలమురళీకృష్ణ ఇకలేరు...

హైదరాబాద్ : ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ(86) కన్నుమూశారు. చెన్నైలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1930 జులై 6న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించిన మంగళంపల్లి ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా కచేరీల్లో పాల్గొన్నారు. భక్తప్రహ్లాద చిత్రంలో నారదుని పాత్ర వేసి అందరినీ మెప్పించారు. 8 ఏళ్ల వయసులో కచేరీ చేసిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ అమెరికా, బ్రిటన్‌, ఇటలీ, రష్యా, ఫ్రాన్స్‌, మలేషియా, సింగపూర్ దేశాల్లో సంగీత కచేరీలు నిర్వహించారు. తెలుగు, సంస్కృతం, కన్నడ, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాషాల్లో పాటలు పాడిన బాలమురళీకృష్ణ.. 400లకు పైగా సినీ గీతాలకు సంగీతం సమకూర్చారు. తండ్రి పట్టాభిరామయ్య వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న బాలమురళీకృష్ణ.. పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌తో పాటు ఎన్నో జాతీయ అవార్డులు అందుకున్నారు. బాలమురళీకృష్ణ మృతి సినీ, సంగీత జగత్తుకు తీరనిలోటని పలువురు సినీ, సంగీత ప్రముఖులు అన్నారు.  
చెన్నైలో రేపు అంత్యక్రియలు 
చెన్నైలోని బీసెంట్‌నగర్‌లో బుధవారం మధ్యాహ్నం మంగళంపల్లి అంత్యక్రియులు నిర్వహించునున్నట్లు.. కుటుంబసభ్యులు తెలిపారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. నలతగా ఉందని రెండు రోజులుగా ఇంటికే పరిమితమైన ఆయన... మంగళవారం సాయంత్రం రాగమాలపిస్తూ అనంతలోకాలకు చేరారు. బాలమురళీకృష్ణకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1930 జులై 6న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించిన మంగళంపల్లి ఆరేళ్ల వయసులో గాయకుడిగా సంగీత ప్రస్థానం ప్రారంభించారు. తండ్రి వద్ద సంగీత స్వర సాధనకు శ్రీకారం చుట్టి గాత్ర సంగీతంలోనేకాక వయోలిన్‌, వీణ, మురళి, మృదంగం తదితర సంగీత వాయిద్యాల్లో ప్రావీణ్యం సాధించారు. టీటీడీ, శృంగేరి పీఠాల ఆస్థాన విద్వాంసునిగా పనిచేశారు. అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, రష్యా, శ్రీలంక, మలేసియా, సింగపూర్‌ దేశాల్లో మంగళంపల్లి పలు కచేరీలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 25వేల కచేరీలు చేసిన ఘనత ఆయన సొంతం. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషన్‌, పద్మవిభూషణ్‌ పురస్కారాలు అందుకున్నారు.  
మంగళంపల్లి మృతి పట్ల పలువురు సంతాపం 
మంగళంపల్లి మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు, ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సంతాపం తెలిపారు.  మంగళంపల్లి కుటుంబసభ్యుడిగా పెరిగానని ప్రముఖ సంగీత విద్వాంసులు మోహనకృష్ణ తెలిపారు. సినీ, సంగీత ప్రపంచానికి మంగళంపల్లి మృతి తీరని లోటని ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కే. విశ్వనాథ్‌ అన్నారు. చెన్నైలోని బీసెంట్‌నగర్‌లో బుధవారం మధ్యాహ్నం మంగళంపల్లి అంత్యక్రియులు నిర్వహించునున్నట్లు..కుటుంబసభ్యులు తెలిపారు. 
కర్ణాటక సంగీతంలో సమున్నత స్థానం 
మధురగాయకుడు, గాన గంధర్వుడు.. పద్మ విభూషణ్ డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ... తిరిగిరానిలోకాలకు తరలివెళ్లారు. తన మధురగానంతో.. ఎంతోమందిని ఓలలాడించిన ఆ సుమధుర స్వరం.. మూగపోవడం సంగీత ప్రియులనే కాదు... యావద్ భారతాన్ని కలిచివేసింది. కర్ణాటక సంగీతంలో సమున్నత స్థానాన్ని అధిరోహించిన బాలమురళీకృష్ణ హిందుస్థానీ సంగీతం, పాశ్యాత్య సంగీతాల్లోనూ నిష్ణాతులు. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు శిష్యులైన బాలమురళి తల్లి వీణ కళాకారిణి. ఆయన తండ్రి వేణువు, వయొలిన్, వీణ వాయిద్యాల్లో విద్వాంసులు. పుట్టుకతోనే సంగీతాన్ని ఉగ్గుపాలతో అందుకున్న బాలమురళి..తన ఎనిమిదో ఏటనే విజయవాడలో త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో తొలి కచేరి చేశారు. 15 ఏళ్ల వయసు వచ్చే సరికే 72 మేళకర్త రాగాల్లో పట్టు సాధించారు.  
కొత్త రీతులతో తాళ వ్యవస్థ
మాతృభాష తెలుగుతో పాటు సంస్కృతం, కన్నడ, తమిళ భాషల్లో దాదాపు 400కు పైగా కర్ణాటక సంగీత బాణీల్లో బాలమురళీకృష్ణ.. కృతులు, వర్ణాలు, జావళులు, తిల్లానలు రచించారు. సంగీత సామ్రాజ్యంలో ఆయన అందుకున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు మరెవరూ అందుకోలేదని చెప్పాలి.  రచనలతో పాటు గణపతి, సర్వశ్రీ, మహతి, లవంగి తదితర రాగాలను సృష్టించి భారతీయ సంగీతంలో బాలమురళి తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. గతి భేదం, సశబ్ద క్రియ వంటి కొత్త రీతులతో తాళ వ్యవస్థను కూడా బలోపేతం చేసిన ఘనత బాలమురళీ కృష్ణకే దక్కుతుంది. 
భక్త ప్రహ్లాద చిత్రంలో నారద మహర్షి పాత్ర 
భక్త ప్రహ్లాద చిత్రంలో నారద మహర్షి పాత్ర ద్వారా వెండి తెరను అలంకరించిన బాలమురళీ కృష్ణ మరెన్నో చిత్రాల్లోనూ నటించారు. నటనకన్నా సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఆయన... హంసగీతె కన్నడ చిత్రంలో హిమాద్రి సుతే పాహిమాం అన్న కీర్తనను ఆలపించారు. ఈ గానానికి గానూ 1976లో ఉత్తమ నేపథ్య గాయకునిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. తర్వాత మాధవాచార్య అనే సినిమాకు ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.  1957 నుంచే బాలమురళి సినిమాల్లోపాటలు పాడారు. ముఖ్యంగా తెలుగులోని గుప్పెడు మనసు చిత్రంలో... మౌనమె నీభాష మూగ మనసా అన్న పాట ప్రతి హృదయాన్నీ కరిగించింది. ఈ మధురగానానికి.. 1976, 87లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు, 1987లో బెస్ట్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌, 2010లో బెస్ట్‌ క్లాసిక్‌ సింగర్‌ అవార్డులు నడిచివచ్చాయి.
25వేలకు పైగా సంగీత కచేరీలు 
తన జీవితంలో.. ప్రపంచవ్యాప్తంగా 25వేలకు పైగా సంగీత కచేరీలు నిర్వహించిన బాలమురళీకృష్ణ, అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యా, శ్రీలంక తదితర ఎన్నో దేశాల్లో కచేరీలు చేసి కర్ణాటక సంగీత ఘనతను ఖండాంతరాలు దాటించారు. కర్నాటక సంగీతంతో పాటు.. త్యాగరాజ కీర్తనల్లో కూడా ఆయన ప్రతిభ అసామాన్యమనే చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పవచ్చు. 
పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు 
తన గానమృతంతో.. సంగీత ప్రియులను ఓలలాడించిన ఈ గాన గంధర్వుడిని కేంద్రం సముచితంగా సత్కరించింది. జాతీయ స్థాయిలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్న బాలమురళీకృష్ణ.. 2005లో ఫ్రెంచి ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక షెవాలియర్ గౌరవాన్ని పొందారు. సంగీత రంగంలో గౌరవ డాక్టరేట్లు అందుకున్న ఈ సంగీత శిరోమణి, మద్రాసులోని మ్యూజిక్ అకాడెమీ నుంచి సంగీత కళానిధి పురస్కారాన్ని సాధించారు.  సంగీత కళానిధి, గాన కౌస్తుభ, గాన కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, నాద జ్యోతి, సంగీత కళా సరస్వతి, నాద మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞానసాగర వంటి ఎన్నో బిరుదులు బాలమురళిని వరించాయి. 

Don't Miss