డీకే అరుణ ఫామ్ హౌస్ పాలిట్రిక్స్ : జైపాల్ రెడ్డికి చెక్

Submitted on 18 January 2019
Congress leader DK Aruna's Farm House Politics: Check for Jaipal Reddy

డీకే అరుణ ఫామ్ హౌస్ లో విందు
జైపాల్ రెడ్డికి చెక్ పెట్టేందుకు సీనియర్స్ తో మీటింగ్

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డికి చెక్ పెట్టేందుకు డీకే అరుణ స్కెచ్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయిన అరుణ ఎంపీ సీట్ పై కన్నేశారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి అడ్డుగా వున్న జైపాల్ రెడ్డికి చెక్ పెట్టేందుకు మరో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డితో కలిసి మంతనాలు జరుపుతున్నట్లుగా రాజకీయ వర్గాల సమాచారం. 

మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించిన డీకే అరుణ ఇటీవల పార్టీ సీనియర్ నేతలను విందు సమావేశానికి ఆహ్వానించినట్లు సమాచారం. హైదరాబాదులోని గండిపేట వద్ద గల ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసిన విందు సమావేశానికి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా పలువురు సీనియర్ నేతలను విందు సమావేశానికి అరుణ పిలిచారట. ఈ విందుకు జానారెడ్డి, రేవంత్ రెడ్డి, మల్లుభట్టి విక్రమార్క,  ఇంకా పలువురు సీనియర్ నేతలు హాజరైనట్లు తెలుస్తోంది. 

మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో రెండు లోకసభ స్థానాలుండగా..వీటిలో నాగర్ కర్నూల్ సీట్ ఎస్సీలకు రిజర్వ్ అయింది. గత ఎన్నికల్లో నంది ఎల్లయ్య పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఆ సీటుపై మల్లు రవి, సంపత్ కుమార్ తదితరులు కన్నేశారు. అయితే, మల్లు రవికి వ్యతిరేకంగా కూడా డీకె అరుణ పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట టిక్కెట్ పై జైపాల్ రెడ్డి, అరుణ మధ్య వివాదం రాజుకుంది. ఈ క్రమంలో మరోసారి ఎంపీ టిక్కెట్ విషయంలో మరోసారి ఇద్దరి మధ్యా వివాదం తలెత్తే అవకాశముంది.
గత ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డిపై ఓడిపోయిన జైపాల్ రెడ్డి మహబూబ్ నగర్ సీటు నుంచి మళ్లీ పోటీకి  యత్నిస్తున్నారు. ఈసారి ఆ సీటుపై డికె అరుణతో పాటు రేవంత్ రెడ్డి ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో దోస్తీ చేసి, జైపాల్ రెడ్డికి చెక్ పెట్టడం ద్వారా మహబూబ్ నగర్ టికెట్ సాధించాలనే పట్టుదలతో డీకె అరుణ ఉన్నట్లు చెబుతున్నారు. 

శాసనసభ ఎన్నికల్లో డీకె అరుణ, జైపాల్ రెడ్డి విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నారాయణపేట స్థానాన్ని శివకుమార్ రెడ్డికి ఇవ్వాలని అరుణ పట్టుబట్టారు. అయితే, చివరకు జైపాల్ రెడ్డి అనుచరుడు సరాఫ్ కృష్ణకు టికెట్ దక్కింది. జైపాల్ రెడ్డి వల్ల వర్గవిభేదాలు చోటు చేసుకుని పార్టీకి నష్టం జరుగుతోందనే సంకేతాలను అరుణ అధిష్టానానికి పంపించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు  రాజకీయ వర్గాల సమాచారం.

Telangana
Mahbubnagar
Lok Sabha
Seat
Deeke. Aruna
Jaipal Reddy
Farm House
politics

మరిన్ని వార్తలు