న్యాయం చేస్తాం : ఇంటర్ ఫలితాల్లో తప్పులపై ముగ్గురు సభ్యులతో కమిటీ

Submitted on 21 April 2019
Committe On Telangana Inter Board Mistakes

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పులపై ప్రభుత్వం స్పందించింది. ఫలితాలు వచ్చిన మూడు రోజుల తర్వాత విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇంటర్ ఫలితాల్లో తప్పులపై ఆయన విద్యాశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఇంటర్ బోర్డులో విభేదాలను మంత్రి అంగీకరించారు. కొంతమంది అధికారుల అంతర్గత గొడవల వల్లే ఈ తప్పులు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఫలితాల్లో వచ్చిన మిస్టేక్స్ పై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసినట్టు మంత్రి తెలిపారు. వెంటనే విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని మంత్రి ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అపోహలను తొలగించడానికే కమిటీని వేశామన్నారు.

తెలంగాణ స్టేట్ టెక్నాలజీస్ సర్విసెస్ ఎండీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కమిటీ వేశారు. హైదరాబాద్ ప్రొఫెసర్ వాసన్, ఐఐటీ హైదరాబాద్ ప్రొ.నిశాంత్ సభ్యులుగా ఉన్నారు. ప్రొ.వాసన్ కు ఐటీ పై స్పష్టమైన అవగాహన ఉందని మంత్రి చెప్పారు. ప్రొ.నిశాంత్ పోటీ పరీక్షల నిర్వహణలో నిపుణుడు అని తెలిపారు. ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఏ ఒక్క విద్యార్థికి ఇబ్బందుల్లేకుండా చూస్తామని, ఎటువంటి పొరపాట్లు జరిగినా సరిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇంటర్ ఫలితాలపై వస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, ఎలాంటి అపోహలకు ఆస్కారం లేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ స్పష్టం చేశారు. ఇంటర్ బోర్డు ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయన్న ఆరోపణలపై అశోక్ స్పందించారు. పరీక్షకు హాజరుకాని విద్యార్థులు కూడా పాస్ అయినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. 21 వేల మంది విద్యార్థుల వివరాలు గల్లంతైనట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఒక్క విద్యార్థి సమాచారం కూడా గల్లంతు కాలేదని స్పష్టం చేశారు. విద్యార్థులందరి వివరాలు బోర్డు దగ్గర భద్రంగా ఉన్నాయని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అన్ని అర్హతలు కలిగిన వారితోనే వాల్యుయేషన్ చేయించినట్టు వివరించారు.

Inter Results
Hyderabad
committe
Jagadish Reddy
Telangana

మరిన్ని వార్తలు