దేవుడయ్యా నువ్వు : ఇడ్లీ బామ్మకి ఫ్రీ గ్యాస్ కనెక్షన్.. బిల్లు కట్టేది ఆనంద్ మహీంద్ర

Submitted on 12 September 2019
Coimbatore Woman Issued LPG Connection After Anand Mahindra Tweets Video

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన గొప్ప మనసు చాటుకున్నారు. పేదల ఆకలి తీరుస్తున్న ఇడ్లీ బామ్మకు అండగా నిలిచారు. ఆమెకి వంట గ్యాస్ కనెక్షన్ వచ్చేలా చూశారు. వివరాల్లోకి వెళితే.. రూపాయికే ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తున్న ఇడ్లీ బామ్మ కమలాత్తాళ్ కు వంట గ్యాస్ కనెక్షన్ లభించింది. ఇన్నాళ్లు అనేక కష్టాలు పడుతూనే కట్టెల పొయ్యి మీద ఇడ్లీలు చేసిన బామ్మ.. ఇకపై వంట గ్యాస్ ద్వారా ఇడ్లీలు చేయనుంది.

తమిళనాడులోని పేరూరుకు చెందిన 80ఏళ్ల కమలాత్తాళ్ కొన్నేళ్లుగా రూపాయికే ఇడ్లీ అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తోంది. రోజుకు వెయ్యి ఇడ్లీలు అమ్ముతుంది. ఈ ఇడ్లీ బామ్మ గురించి ఇటీవల మీడియాలో విస్తృతంగా వార్తలొచ్చాయి. హ్యాట్సాఫ్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ట్విటర్ లో యాక్టివ్ గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా బామ్మ గురించి తెలుసుకున్నారు. ఆమెకి హ్యాట్సాఫ్ చెబుతూ ట్వీట్ చేశారు. ఆమెకి ఆర్థికసాయం చేస్తానని ప్రకటించారు.

''కమలాత్తాళ్ లాంటి మంచి వ్యక్తి గురించి తెలిసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను గమనించిన మరో విషయం ఏంటంటే.. ఆమె ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే వంట చేస్తున్నారు. ఆమె గురించి ఎవరికైనా తెలిస్తే.. నాకు చెప్పండి. ఆమె వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు, ఆమెకు వంటగ్యాస్ స్టౌవ్ కొనిచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా'' అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన మరుసటి రోజే భారత్ గ్యాస్ కోయంబత్తూర్ విభాగం స్పందించింది. కమలాత్తాళ్ కు వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది. బామ్మ ఇంటికి వెళ్లి కొత్త గ్యాస్ స్టౌవ్, సిలిండర్ ఇచ్చారు. ఈ విషయాన్ని మహీంద్రాకు ట్యాగ్ చేస్తూ భారత్ గ్యాస్ ట్వీట్ చేసింది.

ఈ విషయం తెలిసి ఆనంద్ మహీంద్రా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ''ఇది అద్భుతం. కమలాత్తాళ్ కు ఆరోగ్యకరమైన కానుక ఇచ్చినందుకు భారత్ గ్యాస్ కోయంబత్తూర్ విభాగానికి కృతజ్ఞతలు. ఆమెకు ఆర్థికంగా అండగా ఉంటానని ఇదివరకే చెప్పాను.. ఇక మీదట ఆమె వంటగ్యాస్ కు అయ్యే ఖర్చును నేను భరిస్తాను'' అని మహీంద్రా మరో ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా కారణంగానే బామ్మకి వంట గ్యాస్ కనెక్షన్ వచ్చిందని, ఈ విషయం తమకు సంతోషం కలిగించిందని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఆనంద్ మహీంద్రా గొప్ప మనసున్న వ్యక్తి అని కితాబిస్తున్నారు. యు ఆర్ గ్రేట్ సార్ అని పొగుడుతున్నారు. అలాగే భారత్ గ్యాస్ అధికారులను కూడా మెచ్చుకున్నారు.

కమలాత్తాళ్ వడివేలంపలయంలో ఇడ్లీలు అమ్ముతుంది. అక్కడ మధ్య తరగతి, ఆర్థికంగా వెనుకబడిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. వారంతా రోజు కూలీలు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. రోజంతా కష్టపడితేనే నాలుగు వేళ్లు నోట్లోకి వెళతాయి. రోజూ టిఫిన్ కోసం ప్లేట్ ఇడ్లీకి 20 రూపాయలు ఖర్చు పెట్టేంత ఆర్థిక స్థోమత వారికి లేదు, అందుకే తాను రూపాయికే ఇడ్లీ అమ్మి వారికి ఆకలి తీరుస్తాను అని బామ్మ చెబుతుంది. ''వారికి ఆకలి తీర్చడమే నా లక్ష్యం, అందుకే రూపాయికే ఇడ్లీలు అమ్ముతాను. నాకు లాభం వస్తుంది.. కానీ చాలా తక్కువ. అయినా నాకు బాధ లేదు. వారి కడుపు నింపడం నాకు చాలా ఆనందం ఇస్తుంది'' అని బామ్మ అంటుంది.

Coimbatore Woman
Issu
LPG Connection
Anand Mahindra
Tweets Video
Kamalathal
tamilandu
idlis

మరిన్ని వార్తలు