కేంద్రమంత్రుల మాటలకు, వాస్తవాలకు పొంతన లేదు : సీఎం కేసీఆర్

Submitted on 7 December 2019
CM KCR very angry over central government

కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రుల మాటలకు, వాస్తవాలకు అసలు పొంతన లేదన్నారు. ఆర్థిక మాంధ్యం లేదని కేంద్ర చెబుతున్న మాటల్లో నిజం లేదని చెప్పారు. రెవెన్యూ, ఆర్థిక అంశాలపై శనివారం (డిసెంబర్ 7, 2019) ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సీఎం సమీక్షలో ప్రస్తావించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాటా తక్కువగా వచ్చిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల వాటా రూ.924 కోట్లు తగ్గిందన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని చెప్పారు.

2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు పన్నుల వాటా కింద రూ.19 వేల 719 కోట్లు అందివ్వనున్నట్లు కేంద్ర బడ్జెట్ లో పేర్కొందని తెలిపారు. గడిచిన 8 నెలల్లో రాష్ట్రానికి అందిన కేంద్ర పన్నుల వాటా రూ.10 వేల 304 కోట్లు అని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల వాటాలో 8.3 శాతం తగ్గిందన్నారు. ఐజీఎస్టీ ద్వారా తెలంగాణకు రావాల్సిన రూ.2 వేల 812 కోట్లకు కేంద్రం ఎగనామం పెట్టిందని విమర్శించారు. 

కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానం వల్లే రాష్ట్రంలో సంకట పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారయ్యే పరిస్థితి వస్తుందన్నారు. పన్నుల వాటా ప్రకారం నిధులివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి కేసీఆర్ లేఖ రాశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల గురించి సీఎం కేసీఆర్ త్వరలో ప్రధాని మోడీని కలిసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

కేంద్ర పన్నుల వాటా గణనీయంగా తగ్గడంతో రాష్ట్రంలోని అన్ని శాఖలకు నిధులు తగ్గించాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. శాఖలకు సమానంగా నిధుల తగ్గించాలని ఆర్థిక శాఖ కార్యదర్శిని ఆదేశించారు. అన్ని శాఖల్లో ఖర్చులు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఖర్చులపై స్వీయనియంత్రణ పాటించాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర వివరాలతో నివేదికను ఈ నెల 11న జరిగే మంత్రి వర్గం భేటీలో ఇవ్వాలని ఆదేశించారు.
 

CM KCR
Angry
Central Government
Finance
Revenue
Review meeting
Hyderabad

మరిన్ని వార్తలు