ఆనం వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్ : షోకాజ్ నోటీసులివ్వాలని ఆదేశం

Submitted on 7 December 2019
CM jagan Serious On Anam ramnarayana reddy comments

మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రాంనారాయణరెడ్డి మాఫియా వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆనంకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. పార్టీలో ఉంటూ ఇలాంటి విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పార్టీ లైన్ క్రాస్ అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

నెల్లూరు మాఫియాకు కేరాఫ్‌గా మారిందని ఆనం రాంనారాయణ రెడ్డి కామెంట్స్ చేశారు. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, బెట్టింగ్ రాయుళ్లు, కబ్జాకోరులు.. ఇలా.. ఏ మాఫియా కావాలన్నా.. నెల్లూరులో దొరుకుతుందన్నారు. మాఫియా ఆగడాలకు.. నెల్లూరు వాసులు అల్లాడిపోతున్నారని చెప్పారు. మాఫియా విషయంలో.. అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారని చెప్పారు. 

ఏదైనా చేద్దామనుకుంటే.. వాళ్లకు ఉద్యోగ భద్రత గుర్తొస్తుందని చెప్పారు. ఐదేళ్లలో నలుగురు ఎస్పీలు మారారంటే.. నెల్లూరులో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరి అడవుల్లోకి రావాలి.. మాఫియాలు కావాలంటే.. నెల్లూరు రావాలని చెప్పారు. 38 ఏళ్ల తన రాజకీయ అనుభవంలో.. ఇలాంటి మాటలు చెప్పాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఆనం వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో సెగ పుట్టిస్తున్నాయి. 

ఆనం కామెంట్స్‌పై.. ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. పార్టీ అధినేత జగన్ చెప్పినట్లుగానే.. ఎవరైనా నడచుకోవాలన్నారు. పార్టీ రూల్స్‌ను.. ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవన్నారు. ఎంతటివారైనా చర్యలు ఉంటాయన్నారు. ఏమైనా అభిప్రాయ బేధాలొస్తే.. అధినేతకు చెప్పాలన్నారు. మీడియాలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదని విజయసాయిరెడ్డి చెప్పారు.

ఆనం కామెంట్స్ పై.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా స్పందించారు. నెల్లూరులో ఎలాంటి మాఫియా లేదని చెప్పారు. రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ పారదర్శక పాలన కొనసాగుతోందన్నారు. ఆనం రాంనారాయణరెడ్డి దేని గురించి మాట్లాడారో ఆయనే చెప్పాలన్నారు.
 

cm jagan
Serious
Anam Ramnarayana Reddy
Comments
Amaravathi

మరిన్ని వార్తలు