నీటి కష్టాలు : ఖాళీ అవుతున్న లేడీస్ హాస్టల్స్

Submitted on 17 June 2019
Chennai water scarcity, Ladies hostels vacate

ఎన్నడూ లేని విధంగా ఈసారి దేశవ్యాప్తంగా ఎండలు మండిపోయాయి. ఈ వేసవి కాలం చుక్కలు చూపించింది. రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదయ్యాయి. ఎండ దెబ్బకు నీటి కొరత ఏర్పడింది. నదులు, వాగులు, వంకలు, బావులు ఎండిపోయాయి. భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా నీటి కొరత సమస్యగా మారింది. చుక్క నీటి కోసం జనాలు విలవిలలాడిపోతున్నారు.

తమిళనాడు రాజధాని చెన్నైలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చెన్నైలో నీటి కష్టాలు మామూలుగా లేవు. మరీ ముఖ్యంగా లేడీస్ హాస్టల్స్ లో. నీటి కొరత కారణంగా లేడీస్ హాస్టల్స్ లో నీటి వాడకంపై ఆంక్షలు విధించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాటర్ ప్రాబ్లమ్స్ తో లేడీస్ హాస్టల్స్ ఖాళీ అవుతున్నాయి.

చెన్నై నగరం వ్యాప్తంగా వెయ్యి వరకు వర్కింగ్ ఉమెన్స్, లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి. చాలావరకు లీజు మీద నడుస్తున్నవే. నీటి కొరత కారణంగా హాస్టల్స్ యాజమాన్యాలు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడ్డాయి. వేలకు వేలు ఖర్చు పెట్టి నీటిని కొంటున్నాయి. దీంతో నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని హాస్టల్స్ లో ఉండేవారికి చెబుతున్నాయి. రోజువారీ అవసరాలకు కూడా సరిపడ నీరు లభించక హాస్టల్స్ లో ఉండే అమ్మాయిలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు లేక నరకం చూస్తున్నారు.

కొన్ని హాస్టల్స్ లో రోజుకి గంట మాత్రమే వాటర్ సప్లయ్ చేస్తున్నారు. నీరు వచ్చిన సమయంలోనే కాలకృత్యాలన్నీ తీర్చుకోవాలి, స్నానం చేయాలి. లేదంటే ఆ రోజంతా స్నానం చేసే పరిస్థితి కూడా లేదని అమ్మాయిలు వాపోతున్నారు. నీటి కష్టాలు పడలేక చాలామంది హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఈ నీటి కష్టాలు తీరాలంటే వానలు ఒక్కటే మార్గం అని స్థానికులు అంటున్నారు. త్వరగా రుతుపవనాలు విస్తరించి.. సమృద్ధిగా వర్షాలు కురిస్తే కానీ.. ఈ సమస్య పరిష్కారం కాదని చెబుతున్నారు. వరుణిడి కరుణ కోసం స్థానికులు పూజలు కూడా చేస్తున్నారు.

Chennai
Water Scarcity
Ladies hostels
vacate
tamilnadu
Rains
Water
Restrictions
water use


మరిన్ని వార్తలు