TDPకి తిరుపతి సెంటిమెంట్ : బాబు ప్రచార షెడ్యూల్

Submitted on 16 March 2019
Chandrababu Naidu Start Election Campaign From Tirupati

తెలుగుదేశం పార్టీకి తిరుపతి నగరంతో తొలినుంచి అవినాభావ సంబంధం ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇది కొనసాగుతోంది. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు పార్టీని ప్రకటించి తిరుపతి నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. కేవలం 9 నెలల్లోనే అధికారం చేజిక్కించుకున్నారు. నాటి నుంచి టీడీపీకి తిరుపతి సెంటిమెంట్‌గా మారింది. టీడీపీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆ సాంప్రదాయాన్ని చంద్రబాబు  సైతం కొనసాగిస్తూ వస్తున్నారు. ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో... మార్చి 16వ తేదీ శనివారం తిరుపతిలో చంద్రబాబు ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నారు. 

అమరావతి నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. ఇష్టదైవమైన వెంకటేశ్వరుని దర్శించుకున్న తర్వాత... మధ్యాహ్నం ఒంటిగంటకు తిరుపతిలోని తారకరామ మైదానానికి చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ఎన్నికల సమర శంఖరావం పూరించనున్నారు. సభకు హాజరయ్యే పార్టీ బూత్‌ కో-ఆర్డినేటర్లు, బూత్‌ కన్వీనర్లు, సేవామిత్రలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు. గడిచిన ఐదేళ్లుగా చేపట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి పార్టీ నేతలకు వివరించనున్నారు. జిల్లా మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే సుగుణమ్మ, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాని సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

చంద్రబాబు తిరుపతిలో సభ ముగించుకుని అక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం వెళ్లనున్నారు. శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. కోడి రామమూర్తి స్టేడియంలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను టీడీపీ జిల్లా శ్రేణులు పూర్తి చేశాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో బస చేస్తారు. మార్చి 17వ తేదీ ఆదివారం టీడీపీ శ్రేణులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి విజయనగరం పయనమవుతారు.

Chandrababu Naidu
election campaign
Tirupati
Babu
Election 2019
Election Code

తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారన్న పవన్ కల్యాణ్

Choices

మరిన్ని వార్తలు