హాస్య బ్రహ్మ : కామెడీకి కేరాఫ్ బ్రహ్మానందం

Submitted on 16 January 2019
Brahmanandam Suffers From Heart Pain

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు బ్రహ్మానందం. హాస్య బ్రహ్మ అని ఆయనకు పేరు. బ్రహ్మానందం ఫేస్ చూస్తే చాలు నవ్వడం ఖాయం. తెరపై ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్లు, చెప్పే డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. సరదాగా కాసేపు హాయిగా నవ్వుకోవడానికి చాలామంది బ్రహ్మానందం వీడియో క్లిప్పింగ్స్ చూస్తారంటే ఆయనకున్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది.

1986లో జంధ్యాల దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, రజని హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన 'అహ నా పెళ్ళంటా' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు బ్రహ్మానందం. ఆ సినిమా తర్వాత కమెడియన్‌గా వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్‌లో బ్రహ్మానందంకు పోటీ లేరు అనే పేరు సంపాదించారు. దాదాపు మూడు దశాబ్దాలు ఇండస్ట్రీని ఏలిన బ్రహ్మానందం పేరు వింటేనే చాలు వెంటనే మనసు లోతుల్లోంచి పెదాలపై నవ్వు వచ్చేస్తుంది. అంతలా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. చాలా సినిమాల్లో బ్రహ్మానందం పాత్ర మూవీ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. బ్రహ్మానందం ఎక్స్‌ప్రెషన్లు, డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. దొంగ, టీచర్, ఆకు రౌడీ, పంతులు.. రోల్ ఏదైనా ఫుల్ కామెడీ పండించడం బ్రహ్మీకి వెన్నతో పెట్టిన విద్య.

62 సంవత్సరాల బ్రహ్మానందం తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం. కేవలం బ్రహ్మానందాన్ని దృష్టిలో ఉంచుకుని సీన్స్‌ని క్రియేట్ చేసేవారు దర్శక, నిర్మాతలు. దశాబ్దం పాటు బ్రహ్మానందం లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం సౌతిండియాలో టాప్ కమెడియన్‌గా వెలిగారు. రీసెంట్‌గా 'ఎన్టీఆర్ కథానాయకుడు'లో .. రేలంగి పాత్రలో కనిపించారు. ఈ మధ్య బ్రహ్మికి సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. తోటి కమెడియన్ల నుంచి పోటీ పెరగడం, బ్రహ్మి రెమ్యునరేషన్ భారీగా ఉండటంతో.. ఆయనకు ఛాన్సులు తగ్గాయి.

కారణం ఏంటో కానీ బ్రహ్మానందం అస్వస్థతకు గురి కావడం, గుండె నొప్పి రావడం సినీవర్గాల్లో కలకలం రేపింది. కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులు ఆందోళన చెందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని బ్రహ్మానందం చెప్పడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్(ఏహెచ్‌ఐ)కు తీసుకెళ్లారు.  వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు తక్షణమే సర్జరీ చేయాలని సూచించారు. హార్ట్ సర్జన్ స్పెషలిస్ట్ రమాకాంత్ పాండా 2019, జనవరి 15వ తేదీ మంగళవారం బ్రహ్మానందంకు సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. ఆయన కొడుకులు రాజా గౌతమ్, సిద్దార్థ్ ఆసుపత్రిలో దగ్గరుండి చూసుకుంటున్నారు. బ్రహ్మానందం త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు ట్వీట్స్, కామెంట్స్ చేశారు.

comedy star brahmanandam
cardiac arrest
heart pain
Bypass Surgery
Tollywood
Mumbai

మరిన్ని వార్తలు