చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పారు : ఏపీలోనూ బీజేపీ బలపడుతుంది

Submitted on 24 May 2019
bjp leaders fire on chandrababu

ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఊహించని రీతిలో అతి తక్కువ అసెంబ్లీ, లోక్ సభ సీట్లు వచ్చాయి. ఎన్నికల ఫలితాల తర్వాత.. బీజేపీ నేతలు టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పారని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు అన్నారు. చంద్రబాబు ఒరిజినాలిటీ లేని నాయకుడు అని అన్నారు. టీడీపీకి 30కంటే ఎక్కువ సీట్లు రావని ముందే చెప్పామన్నారు. గతంలో చంద్రబాబుతో పొత్తు కారణంగా ఏపీలో బీజేపీ, జనసేన నష్టపోయాయని సోము వీర్రాజు అన్నారు. సాక్ష్యాత్తు స్పీకర్ కోడెలపైనే దాడి చేశారంటే ప్రజల ఆగ్రహం ఏ రేంజ్ లో ఉందో తెలుసుకోవచ్చన్నారు. టీడీపీపై తమకున్న కోపాన్ని ప్రజలు ఓట్ల రూపంలో చూపించారని సోము వీర్రాజు అన్నారు.

మరో బీజేపీ నేత జీవీఎల్ సైతం చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు, టీడీపీ చేసిన తప్పులే వైసీపీ భారీ విజయానికి కారణం అని జీవీఎల్ అన్నారు. మోడీని అడ్డుపెట్టుకుని చంద్రబాబు ఎవరిని విమర్శించినా వారికి లాభం జరుగుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీని కోడికత్తి పార్టీ అని ఎవరైనా విమర్శిస్తారా అని జీవీఎల్ అడిగారు. జగన్ పై దాడిని చంద్రబాబు అవహేళన చేస్తూ మాట్లాడారని మండిపడ్డారు. ఏపీలో అద్భుత విజయం సాధించిన జగన్ కు జీవీఎల్ అభినందనలు తెలిపారు. గతంలో బలంగా లేని చోట్ల బీజేపీ బలం పుంజుకుందన్న జీవీఎల్.. ఏపీలోనూ బీజేపీ బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలు చంద్రుడిని తిరస్కరించారని బీజేపీ నేత మురళీధర్ రావు అన్నారు. ఇప్పుడు చంద్రుడు ఉనికి కోసం పోరాడుతున్నారని చంద్రబాబుని ఉద్దేశించి చెప్పారు. చంద్రుడు లేకుంటే ఢిల్లీ ఉండదనే ప్రచారం చేశారని విమర్శించారు. ఢిల్లీపై ఇక చంద్రగ్రహణం ఉండదన్నారు. బీజేపీ ఓటమి కోసం ఏపీ ప్రభుత్వ డబ్బుని చంద్రబాబు దుర్వినియోగం చేశారని మురళీధర్ రావు ఆరోపించారు. ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం బీజేపీకి రాబోతోందని మురళీధర్ రావు చెప్పారు. హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యాయలంలో విజయోత్సవ సభ నిర్వహించారు. బీజేపీ నేతలు లక్ష్మణ్, మురళీధర్ రావు, దత్తాత్రేయ, డీకే అరుణ హాజరయ్యారు.

Chandrababu
BJP
GVL
somu veeraraju
Muralidhar rao
ap elections
results

మరిన్ని వార్తలు