
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. మ్యాచ్‌లో మొదటి పది ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు చేజార్చుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. క్యారీ అవుట్ అనంతరం ఆసీస్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. హిట్టర్ ఆరోన్ ఫించ్ కూడా కాస్త తడబడ్డాడు. పరుగులు తీసేందుకు తటపటాయించాడు. అంతలా బెదరగొట్టాడు భువనేశ్వర్. అయితే ఫించ్ అవుటవడానికి ముందు మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్ భువీ బౌలింగ్ చేస్తున్నాడు. పరుగులు మాట అటుంచి వికెట్ కాపాడుకునేందుకు ఆరోన్ ఫించ్ జాగ్రత్తపడుతున్నాడు. ఈ సమయంలో భువనేశ్వర్ పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని ఆఫ్ స్టంప్ దిశగా విసిరాడు. కానీ, బంతిని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేని ఫించ్ పక్కకు జరిగిపోయాడు. వెంటనే అంపైర్ దానిని డెడ్ బాల్‌గా ప్రకటించి చేతులు ఊపాడు.
అసలేం జరిగిందంటే, భువీ వేస్తున్న బంతిని అంచనా వేసి షాట్ బాదాలని ఫించ్ ఎదురుచూస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన భువీ అంపైర్ వెనుకనుంచి బాల్ విసిరాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఫించ్ కంగుతిని వెనక్కు జరిగిపోయాడు. కానీ, ఆ తర్వాతి బంతికే ఫించ్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. డెడ్ బాల్ అని ప్రకటించడానికి తటపటాయించిన అంపైర్ ఈ సారి మాత్రం వెంటనే వేలు పైకెత్తి అవుట్‌ని ప్రకటించాడు.