'నా సినిమాలను నిషేధించండి' : ట్వింకిల్‌ ఖన్నా

14:12 - September 9, 2018

మహారాష్ట్ర : 'నా సినిమాలను నిషేధించండి' అని నటి, రచయిత్రి ట్వింకిల్‌ ఖన్నా అంటున్నారు. తెలుగులో 'శీను', హిందీలో ‘బర్సాత్‌, ‘మేలా’తదితర చిత్రాల్లో ట్వింకిల్‌ నటించారు. నటిగా కంటే రచయిత్రిగానే ఆమెకు మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పటివరకు తాను చేసిన సినిమాలను నిషేధించాలని, వాటిని ప్రేక్షకులు ఎవ్వరూ చూడకూడదని అంటున్నారు. ట్వింకిల్‌ రాసిన ‘పైజామాస్‌ ఆర్‌ ఫర్గివింగ్’పుస్తకాన్ని శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ట్వింకిల్‌ భర్త అక్షయ్‌కుమార్‌, బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ట్వింకిల్‌ తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. 'ఇప్పటివరకు నేను నటించిన ఏ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. కాబట్టి నేను నటించిన సినిమాలు నిషేధించాలి. వాటిని ఎవ్వరూ చూడకూడదు. ఒక్కోసారి నా కెరీర్‌ గురించి ఆలోచించడం కూడా నాకు నచ్చదు. అందుకే నాకు అల్జీమర్స్‌ వ్యాధి ఉందని ఊహించుకుంటూ నా కెరీర్‌ను మర్చిపోవాలని అనుకుంటున్నాను. కరణ్‌ జోహార్‌ తొలిసారి నాతో యాడ్‌ ఫిలింను చిత్రీకరించబోతున్నాడు. దేవుడు అతన్ని చల్లగా చూడాలి. ఎందుకంటే నాకు నటించడం రాదు.' అని ట్వింకిల్‌ వెల్లడించారు.

 

Don't Miss