ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు బాబు దిశానిర్దేశం

Submitted on 19 July 2019
Babu's direction to MLAs and MLCs

జగన్‌ పాలనపై మరోసారి మండపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజధానిలో పనులేమీ చేయలేదన్న వైసీపీ నేతల ఆరోపణలపై ఘాటుగా రియాక్టయ్యారు. మంగళగిరిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో 2019, జులై 18వ తేదీ గురువారం సమావేశమైన ఆయన... ప్రభుత్వ పనితీరును తప్పుబట్టారు. రాజధాని రాకముందు అక్కడ ఎకరా 40లక్షలు పలికే భూమి ధర... జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల 15లక్షలకు పడిపోయిందని ఫైరయ్యారు. అమరావతిలో కనీసం తాము ప్రారంభించిన పనులను పూర్తిచేసినా.. దేశంలో ఏపీ రాజధాని గురించి చెప్పుకునే పరిస్థితి ఉంటుందన్నారు.

రాజధాని నిర్మిస్తే తమ భూముల ధరలు పెరుగుతాయన్న నమ్మకం, టీడీపీపై ఉన్న విశ్వాసంతోనే అక్కడి రైతులు... కేవలం 34వేలకు ఎకరా చొప్పున ఇచ్చారని గుర్తుచేశారు. 
పీపీఏలపై జగన్ సర్కార్ వితండవాదం చేస్తోందన్న చంద్రబాబు... కనీసం సమాధానం కూడా చెప్పలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి లాభం చేకూర్చేలా తాము నిర్ణయాలు తీసుకున్నామన్న ఆయన.. సాంప్రదాయేతర ఇంధన వనరుల కొనుగోలు ధరలపై ప్రభుత్వం ప్రజలను తప్పుపట్టించేందుకు ప్రయత్నించి అభాసుపాలవుతోందన్నారు. విద్యుత్ సంస్కరణలతో రాష్ట్రాన్ని తాము దేశానికి దిక్సూచిగా మార్చితే... ఈ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్థం చేస్తోందని మండిపడ్డారు.

తమ హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని, ఎక్కడా కొరత అనేది లేకుండా చేశామన్నారు చంద్రబాబు. కానీ.. వైసీపీ అధికారం చేపట్టిన నెలలోనే రైతులు రోడ్డెక్కే పరిస్థితి తలెత్తడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వానికి పాలనపై అవగాహనలేక ఆపసోపాలు పడుతోందని.. ఫలితంగా విద్యుత్ కోతల అవస్థలు తప్పడంలేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగాయంటున్న అధికార పక్షం ఆరోపణలపై... చట్టసభల్లో గట్టిగా స్పందించాలని టీడీపీ నాయకులకు సూచించారు. పీపీఏలతో పాటు ప్రతి అంశంలోనూ టీడీపీ వాదనను మరింత బలంగా వినిపించాలని దిశానిర్దేశం చేశారు.

Babu
direction
MLAs
mlcs
AP Assembly News

మరిన్ని వార్తలు