ఆటోడ్రైవర్ నిజాయితీ : మర్చిపోయిన రూ.10లక్షలు తిరిగిచ్చేశాడు

Submitted on 7 February 2019
Auto Driver Honesty, Returns rs 10 lakh

హైదరాబాద్: రోడ్డు మీద పది రూపాయలు దొరికినా టక్కున తీసుకుని జేబులో వేసుకునే జనాలున్న రోజులివి. మూడో కంటికి తెలియకుండా ఆ డబ్బుని దాచేస్తారు. కాసుల కోసం మనిషి ఎన్నో  అడ్డదారులు తొక్కుతున్నాడు. మనీ కోసం మర్డర్లు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అలాంటి ఈ కలికాలంలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10లక్షల రూపాయల క్యాష్ దొరికితే ఎవరైనా  వదులుకుంటారా చెప్పండి. నో డౌట్ వదిలే చాన్సే లేదంటారా. కానీ.. అందరూ ఒకేలా ఉండరని... మనుషుల్లో ఇంకా నీతి, నిజాయితీ బతికే ఉందని నిరూపించాడు ఓ ఆటో డ్రైవర్.

 

ఆటోలో ప్యాసింజర్ మర్చిపోయిన రూ.10లక్షల నగుదు బ్యాగును సంబంధిత వ్యక్తులకు అప్పగించి రమేష్ అనే ఆటోడ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. శభాష్ రమేష్.. అని అందరి చేత  ప్రశంసలు అందుకున్నాడు. 2019, ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం గచ్చిబౌలి పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. సిద్ధిపేటకు చెందిన సోదరులు కొత్తూరు క్రిష్ణ, ప్రసాద్‌లు కొండాపూర్  శ్రీరాంనగర్ కాలనీలో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. నిర్మాణ ఖర్చుల నిమిత్తం రూ.10లక్షల క్యాష్ తీసుకుని సిద్ధిపేట నుంచి ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం ఉదయం బయలుదేరారు. జూబ్లీ  బస్‌స్టేషన్‌లో దిగారు. అక్కడి నుంచి ఆటోలో శ్రీరాంనగర్ కాలనీలోని సైట్‌కు మధ్యాహ్నం 1గంటకు చేరుకున్నారు. ఆటో దిగి వెళ్లిపోయారు. అయితే 10లక్షల రూపాయలు ఉన్న క్యాష్ బ్యాగును  మాత్రం ఆటోలోనే మర్చిపోయారు.

 

దీంతో వారు కంగారుపడ్డారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. 100కు డయల్ చేసి జరిగిన విషయం చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆటో దిగిన సైట్ దగ్గర నుంచి  జూబ్లీ బస్‌స్టేషన్ వరకు ఆటోలను తనిఖీ చేస్తున్నారు. అప్పటికే కొద్ది దూరం వెళ్లిపోయిన రమేష్‌కు ఆటోలో ప్యాసింజర్లు మర్చిపోయిన బ్యాగ్ కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో క్యాష్  ఉంది. దీంతో అతడు వెంటనే ప్రయాణికులను వదిలిన సైట్ వద్దకు తిరిగి వచ్చాడు. దీంతో బాధితులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్ సమక్షంలో క్యాష్  బ్యాగ్‌ను ఆటో డ్రైవర్ రమేష్ చేతుల మీదుగా బాధితులకు అప్పగించారు పోలీసులు. నిజాయితీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ రమేష్‌ను పోలీసులు అభినందించారు. ఆటోవాలా అయినా, పేదరికం  వెంటాడుతున్నా, అప్పుల్లో ఉన్నా.. నిజాతీయిగా వ్యవహరించి సంబంధింత వ్యక్తులకు క్యాష్ బాగుని అప్పగించిన ఆటో డ్రైవర్ రమేష్ అందరికీ ఆదర్శంగా నిలిచాడని కితాబిచ్చారు.

auto driver honesty
returns 10 lakh rupees bag
Hyderabad
auto driver ramesh
gachibowli
passnger
return money
sri ram nagar colony

మరిన్ని వార్తలు