
ఆధార్ కార్డుదారులకు షాకింగ్ న్యూస్. ఇకపై మీ ప్రాపర్టీకి కూడా ఆధార్ లింక్ చేయాల్సిందే. త్వరలో కొత్త రూల్ రాబోతోంది. ఇప్పటికే ఎన్నో అంశాలపై ఆధార్ అనుసంధానం తప్పనిసరి అనే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా ప్రాపర్టీతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసే దిశగా కసరత్తు చేస్తోందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అదేగానీ నిజమైతే.. ఆస్తులతో ఆధార్ లింక్ తప్పనిసరి చేస్తే మాత్రం.. బ్లాక్ మనీ, మనీ లాండరింగ్‌పై మరో పెద్ద సర్జికల్ స్ట్రయిక్‌కు రంగం సిద్ధమైనట్టే. దేశంలో నల్ల డబ్బును అరికట్టేందుకు 2016 నవంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడం అప్పట్లో తొలి పెద్ద సర్జికల్ స్ట్రయిక్ కాగా.. ఆ తర్వాత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతోందంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్లాక్ మనీ కట్టడిపై కఠిన చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగంపైనే తొలి దెబ్బ పడింది. బ్లాక్ మనీ ఎక్కువ శాతం దీనిలోకే మళ్లీంచడంతో రియల్ రంగం డీలా పడింది. ప్రాపరీ ధరలు కూడా అమాంతం తగ్గిపోయాయి. ప్రాపర్టీల విలువ కూడా క్షీణించి ఆర్థిక మందగమనానికి కీలకంగా మారింది.
నల్ల డబ్బును నియంత్రించడంతో ఒకప్పుడు ఆకాశాన్ని అంటిన ప్రాపర్టీల ధరలు ఒక్కసారిగా పడిపోయి కొనుగోలుదారులకు అందుబాటు ధరకే దిగొచ్చాయి. ప్రత్యేకించి 2022 నాటికి అందరికి ఇళ్లు అందించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఆస్తులతో ఆధార్ అనుసంధానం చేసే చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చే అంశం చివరి దశలో ఉందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.
ఇదేగానీ జరిగితే.. కొత్త చట్టం అమల్లోకి వస్తే.. బినామీ (ప్రాక్జీ) వంటి లావాదేవీలకు అడ్డుకట్ట వేసినట్టే అవుతుంది. తద్వారా ప్రాపర్టీల కొనుగోలు లావాదేవీల్లో మరింత పారదర్శకత పెరిగి ధరలు అతిచేరువకు దిగొచ్చే అవకాశాలు మెరుగుపడతాయి. ప్రాపర్టీలతో ఆధార్ అనుసంధానంపై NAREDCO (మహారాష్ట్ర) నహార్ గ్రూపు వైస్ చైర్ పర్సన్, అండ్ వైస్ ప్రెసిడెంట్ మంజు యాగ్నింక్ మాట్లాడుతూ.. ‘ప్రాపర్టీ ఓనర్ షిప్ తో ఆధార్ నెంబర్ అనుసంధానమనే ప్రతిపాదన స్వాగతించదగినది. రెసిడెన్షియల్ సిగ్మెంట్ కు అనుకూలమైన అంశం. విశ్వసనీయత, పారదర్శకత పెరుగుతుంది.
ఇళ్లు కొనుగోలుదారులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. తమ లావాదేవీలపై భద్రతను తీసుకొచ్చినట్టు అవుతుంది’ అని అన్నారు. మహారాష్ట్ర NAREDCO అధ్యక్షుడు రాజన్ బండెల్కర్ మాట్లాడుతూ.. ప్రాపర్టీ ఓనర్ షిప్ తో ఆధార్ లింక్ చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగం నుంచి బ్లాక్ మనీని నిర్మూలించడమే కాకుండా మోసపూరిత లావాదేవీలను నియంత్రించవచ్చు’ అని అన్నారు. ఇళ్ల ధరలను హేతుబద్ధీకరణ చేసేందుకు దోహదపడుతుందని ఆయన చెప్పారు. తద్వారా ఎవరైతే బినామీ ప్రాపర్టీలపై పెట్టుబడి పెట్టారో వారంతా తిరిగి వెనక్కి తీసుకోక తప్పదన్నారు.