బస్సు నడిపాడని : తాత్కాలిక డ్రైవర్ పై దాడి

Submitted on 19 October 2019
attack on bus driver

కరీంనగర్‌ బస్టాండ్‌ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంద్‌ సందర్భంగా తాత్కాలిక డ్రైవర్‌ బస్‌ నడపడంతో ఆగ్రహించిన కార్మికులు అతనిపై దాడి చేశారు. తాము నిరసన చేస్తుంటే బస్సు ఎలా నడుపుతావంటూ అతనిపై చేయిచేసుకున్నారు కార్మికులు. బస్సును అడ్డుకుని ఆందోళన చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని బస్సును డిపోలోకి తరలించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

మరోవైపు బస్టాండ్ ముందు బస్సుపై సీపీఎం నేతలు దాడికి యత్నించారు. బస్సుల టైర్లలో గాలి తీసే ప్రయత్నం చేశారు. కర్రలతో దాడికి పాల్పడ్డారు. బస్సు పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకుని పరిస్థితిని అదుపు చేశారు. అటు నిజామాబాద్ జిల్లాలో రెండు చోట్ల బస్సులపై నిరసనకారులు దాడులకు తెగబడ్డారు. ఆచన్ పల్లి, ముజారక్ నగర్ లో రాళ్లు రువ్వారు. ఈ దాడిలో రెండు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు వనపర్తిలోనూ ఆందోళకారులు బస్సుపై రాళ్లు విసిరారు.

ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె 15వ రోజూ కొనసాగుతోంది. కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన బంద్ కు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. శనివారం ఉదయం నుంచే ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. డిపోల ఎదుట బైఠాయించి బస్సులను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. బంద్‌ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, వరంగల్ నల్గొండ జిల్లాల్లోని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపోల ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్ష, జనసమితి నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.

బంద్ నేపథ్యంలో బస్ భవన్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళన కారులను నియంత్రించేందుకు బారికేడ్లతోపాటు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పటిష్ఠ బందోబస్తు పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. 

Attack
Bus driver
Karimnagar
bandh
TSRTC

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు