పుల్వామాలో మరో ఉగ్రదాడి: ఆర్మీ కాన్వాయ్‌ లక్ష్యంగా పేలుడు

Submitted on 17 June 2019
Army Vehicle Attacked In Jammu And Kashmirs Pulwama

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీ కాన్వాయ్‌ లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ పేలుడులో 9మంది జవాన్లకు గాయాలయ్యాయి. ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. అనంత్ నాగ్ లో ఎన్ కౌంటర్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి జరిగింది. పుల్వామా తరహా ఉగ్రదాడి జరగొచ్చని రెండు రోజుల క్రితం పాకిస్తాన్ నిఘావర్గాలు భారత్ ను హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి జరిగిన ప్రాంతంలోనే ఈ అటాక్ జరగడం కలకలం రేపింది. 44వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఆర్మ్‌డ్ కాన్వాయ్ పై పుల్వామా జిల్లాలోని అరిహల్ గ్రామం సమీపంలో ఈ దాడి జరిగింది. ఇటీవల కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది జకీర్ మూసాని బలగాలు మట్టుబెట్టాయి. మూసా మ‌ృతికి ప్రతీకారంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడొచ్చనే నిఘా వర్గాల సమాచారంతో కశ్మీర్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎన్ కౌంటర్ లో చనిపోయిన బుర్హాన్ ప్రధాన అనుచరుడే జకీర్ మూసా. మే 24న భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మూసా చనిపోయాడు. ఆ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా పుల్వామా, అవంతిపొర జిల్లాల్లో పుల్వామా తరహా దాడులకు ముష్కరులు తెగబడొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

అనంత్ నాగ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు.. అనంత్ నాగ్‌లో కూంబింగ్ చేపట్టాయి. భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు.. ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు జవాన్లు గాయాలపాలయ్యారు. ఓ కెప్టెన్ వీరమరణం చెందారు.

వీరమరణం పొందిన కెప్టెన్ ని కీతన్ శర్మగా గుర్తించారు. 19 RR కి చెందిన కెప్టెన్. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కీతన్ శర్మ శ్రీనగర్ లోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ  చనిపోయారు. గాయపడిన జవాన్లకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అనంత్ నాగ్ జిల్లా బిదురా గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం వచ్చింది. రంగంలోకి దిగిన  భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో జవాన్లు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకున్నారు. ముందుజాగ్రత్తగా అనంత్ నాగ్ లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.

Army Vehicle
attacked
Jammu and Kashmir
PULWAMA
Encounter
Pakistan
terrorists
Militants


మరిన్ని వార్తలు