ఏఎన్నార్ అవార్డులు : హైలెట్‌గా నిలిచిన రేఖ

Submitted on 18 November 2019
ANR Awards 2018-19 Special Attraction Rekha

అందం కొందరికి దేవుడిచ్చిన వరమైతే..వయస్సుతో పాటు అది పెరగడం కొందరికే సాధ్యం. అలాంటివారిలో నటి రేఖ ఒకరు. ఏఎన్ఆర్ అవార్డ్స్ ఫంక్షన్‌ కోసం హైదరాబాద్ వచ్చిన ఈమె..మొత్తం ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచారు. సెలబ్రెటీలతో కలిసిపోయిన తీరు ఒక ఎత్తు అయితే.. ఆమె మాట్లాడిన తెలుగు మరో ఎత్తు అనడంలో సందేహం లేదు. అన్నపూర్ణ స్టూడియోలో 2019, నవంబర్ 17వ తేదీ ఆదివారం సాయంత్రం జరిగిన అక్కినేని అవార్డ్స్ ఫంక్షన్‌‌లో నటి రేఖ తళుక్కుమని మెరిసారు. 2019 సంవత్సరానికి ఏఎన్ఆర్ పురస్కారం అందుకున్న ఆమె..నిజంగానే వయసుని జయించారంటే ఆశ్చర్యంలేదు. 

అద్భుతమైన ఆహార్యం..కట్టూ బొట్టుతో ఆడియెన్స్‌ని రేఖ కట్టిపడేసారంటే ఆతిశయోక్తి కాదు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన కార్యక్రమానికి హైలైట్ పాయింట్ ఏంటంటే..అది రేఖ అని చెప్పాలి..ఫంక్షన్ ఆద్యంతం సభికులతో పాటు..సెలబ్రెటీలు కూడా రేఖనే కన్నార్పకుండా చూసేలా ఉందామె స్టైల్. గోల్డ్ కలర్ శారీ..భుజాలచుట్టూ కప్పుకున్న కొంగుతో ఓ హుందాతనం ఉట్టిపడిన ఈమె ఫంక్షన్‌కి వచ్చిన అందరినీ ఆప్యాయంగా పలకరించడం ఆడియెన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది.

మెగాస్టార్‌ చిరంజీవికి నమస్కరించిన రేఖ..తర్వాత స్టేజ్‌పై నాగార్జున వేసిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన తీరు నవ్వులను పూయించింది. అందులోనూ అచ్చమైన తెలుగు రేఖ మాట్లాడుతుంటే నోరెళ్లబెట్టడం మిగిలినవారి వంతుగా మారింది. రేఖ ఇంత చక్కని తెలుగు మాట్లాడటం అనూహ్యంగా చాలామంది ఫీలయ్యారు. తన తొలి తెలుగు సినిమా ఏంటో నాగార్జునని అడిగి..మరీ చెప్పడం చాలామందికి ముచ్చట అన్పించింది. తరగని అందం, వన్నె తగ్గని హుందాతనం కలగలిపితే రేఖ అనాలి..ఇదే ఏఎన్ఆర్ అవార్డ్స్ ఫంక్షన్ మొత్తం చూసినవారికి అన్పించిందంటే వారి తప్పు కాదు.
Read More : ఆ గర్భవతి మా అమ్మే.. కడుపులో ఉన్నది నేనే - చిరంజీవి

ANR Awards
special attraction
Rekha
Chiru
Nagarjuna Family

మరిన్ని వార్తలు