రావాలి జగన్.. ఆవాజ్ కునాచా.. ఇప్పుడు లగేరహో కేజ్రీవాల్: ఢిల్లీలో మారుమ్రోగుతున్న పాట

Submitted on 12 January 2020
AAP launches ‘Lage Raho Kejriwal’ poll song

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి రాజకీయ పార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు, వారిని ఉత్తేజపరిచేందుకు పాటల ఆల్బమ్ లను రూపొందిస్తాయి. ఇదివరకు తరలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా అంటూ టీడీపీ జనాల్లోకి వదిలిన సాంగ్ చాలా ఫేమస్.. ఆ పాట తర్వాత తెలుగునాట అంత పాపులర్ అయిన సాంగ్ 'రావాలి జగన్.. కావాలి జగన్..'. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ రూపొందిన రావాలి జగన్.. కావాలి జగన్ అనే సాంగ్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎంత ఊపును ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాట హిట్ అవడమే కాక ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 

ఈ క్రమంలోనే ఇదే తరహా మ్యూజిక్, లిరిక్స్ తో మహారాష్ట్రలోని శివసేన పార్టీ 'ఆవాజ్ కునాచా' అనే పాటను రూపొందించింది. అక్కడ కూడా ఆ పాట సూపర్ హిట్ అయ్యింది. వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే కార్యక్రమాలను వివరిస్తూ 'రావాలి జగన్.. కావాలి జగన్' పాట రూపకల్పన చేయగా.. శివసేన కూడా తాము చేయబోయే పనుల గురించి వివరిస్తూ ఆవాజ్ కునాచా పాటను రూపొందించింది. మహారాష్ట్రలో కూడా అవకాశమే లేని చోట కూడా శివసేన ముఖ్యమంత్రి పీఠం ఎక్కింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో తన గాలి వీచేలా చేసుకున్న బీజేపీకి చెక్ పెట్టి సీఎం సీటు దక్కించుకుంది శివసేన.

ఇప్పుడు అదేదారిలో మళ్లీ తన పవర్‌ని నిలుపుకునేందుకు ఢిల్లీలోని అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఢిల్లీకి ఐదేళ్లు సీఎంగా కొనసాగిన కేజ్రీవాల్ ఎన్నికల ముందు ప్రచారం గట్టిగా చేస్తున్నారు. అందులో భాగంగానే "లగే రహో కేజ్రీవాల్" అనే సాంగ్‌ను విడుదల చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడా సాంగ్ వైరల్ అయ్యింది. ప్రతి ఒక్కరూ లగే రహో కేజ్రీవాల్ పాట అదిరిపోయింది అంటూ పాడుతున్నారు.

‘లగే రహో కేజ్రీవాల్’ పాటను ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ శిశోడియా లేటెస్ట్‌గా విడుదల చేశారు. 2 నిమిషాల 52 సెకండ్లు ఉన్న ఈ పాటను బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ రూపొందించారు. ‘‘అచ్ఛే బీతే పాంచ్ సాల్, లగే రహో కేజ్రీవాల్’’ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆప్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ప్లాన్ చేస్తుంది. గత ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ సీట్లకు గాను 67 సీట్లు ఆప్‌కి వచ్చాయి. ఈసారి కూడా ఆప్ గెలవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుచుకున్న బీజేపీ... 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీలో 7 ఎంపీ స్థానాలుండగా ఏడింటినీ కైవసం చేసుకుంది. అందువల్ల ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కి గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 54.3 శాతం ఓట్లు గెలుచుకోగా... బీజేపీ 32.3 శాతం... కాంగ్రెస్ 9.7 శాతం ఓట్లు సాధించుకున్నాయి.

AAP
Lage Raho Kejriwal
poll song

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు