ట్యాక్స్ కట్టకుండా తప్పించుకోలేరు : ఆధార్ అస్త్రం ప్రయోగించనున్న ఐటీ

Submitted on 22 July 2019
Aadhaar new tax tool to keep tabs on big purchases

ఇన్ కమ్ ట్యాక్స్ కట్టకుండా తప్పించుకునే వారి ఆటలకు చెక్ పడనుంది. ఇకపై వారు తప్పించుకోలేరు. ట్యాక్స్ ఎగ్గొట్టే వారి పని పట్టేందుకు ఐటీ శాఖ కీలక అస్త్రం ప్రయోగించనుంది. అదే ఆధార్. అవును.. ఆధార్ ద్వారా ట్యాక్స్ ఎగ్గొట్టే వారి భరతం పట్టేందుకు ఐటీ శాఖ రెడీ అవుతోంది. ఖరీదైన ఇళ్లు, కార్లు, ఆభరణాలు కొనుగోలు చేస్తూ అందుకు తగ్గ ఆదాయాన్ని చూపని వారిని గుర్తించేందుకు ఐటీ విభాగం ఆధార్‌ కార్డును టూల్ గా వాడాలని భావిస్తోంది. ప్రస్తుతం రూ.50వేలు, అంతకు మించి కొనుగోళ్లు జరిపేటప్పుడు పాన్‌కార్డు వివరాలు ఇవ్వాలి. పాన్‌ కార్డు లేదని చెప్పి కొందరు తప్పించుకుంటున్నారు. ఇకపై పాన్ కార్డు లేని వారు తమ ఆధార్‌ వివరాలు ఇవ్వాల్సి ఉంటంది. ఈ నిబంధనను తప్పనిసరిగా చేసేందుకు ఐటీ విభాగం ఏర్పాట్లు చేస్తోంది.

పట్టణ ప్రాంతాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఖరీదైన ఇళ్లు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు పాన్‌ కార్డ్‌ చూపకపోతే ఆధార్‌ వివరాలు ఇవ్వడం తప్పనిసరి చేయనున్నారు. దీని వల్ల ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేవారి సంఖ్య పెంచొచ్చని, ట్యాక్స్ తక్కువగా కట్టేందుకు తమ ఆదాయాలను తక్కువగా చూపించే వారిని కూడా గుర్తించేందుకు వీలు కలుగుతుందని ఐటీ విభాగం అధికారులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో జరుగుతున్న భారీ ఆర్థిక లావాదేవీలను, పన్ను ఎగవేతదారులను గుర్తించడం, ఎక్కువ మందిని పన్ను పరిధిలోకి తీసుకు రావడమే లక్ష్యంగా ఐటీ అధికారులు 3 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ  లక్ష్యాలను సాధించాలంటే పాన్‌కార్డుకు బదులుగా ఆధార్‌కార్డును తీసుకోవడం, ఆధార్‌ వివరాలు ఇచ్చి భారీ మొత్తంతో కొనుగోళ్లు చేసిన వారికి వెంటనే పాన్‌ కార్డు జారీ చేయడం, పాన్‌కార్డుకు ఆధార్‌ కార్డు  వివరాలను జత చేయకపోతే పాన్‌కార్డులను సెప్టెంబర్‌ ఒకటి నుంచి నిరుపయోగం చేయాలన్నది మూడు కీలక నిర్ణయాలు.

దేశంలో 90శాతం ప్రజలకు ఆధార్‌ కార్డులు ఉన్నాయి. ఐటీ విభాగం ఇప్పటివరకు 22 కోట్ల మందికి మాత్రమే పాన్‌ కార్డులు జారీ చేసింది. అంటే ఆధార్‌ ఉన్న వారిలో ఐదోవంతు మందికి మాత్రమే పాన్‌కార్డులు ఉన్నాయి. 2018 డిసెంబర్‌ నాటికి 6.86 కోట్ల మంది తమ ఆదాయ వివరాలు ఐటీ విభాగానికి సమర్పించారు. మోడీ ప్రభుత్వం కనీసం 12 కోట్ల మందిని ఐటీ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోంది.

Aadhaar
new tax tool
tabs
big purchases
PAN
Income Tax
IT Department

మరిన్ని వార్తలు