చంద్రబాబుకు జగన్ లేఖ..హెచ్చరికలు..

22:20 - December 3, 2016

విజయవాడ : ఏపీలో ఆరోగ్య శ్రీ అమలుతీరుపై వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారంటూ ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ సీఎం చంద్రబాబుకు బహిరంగలేఖ రాశారు. ఎన్టీఆర్‌ ఆరోగ్యాన్ని చివరిరోజుల్లో చూసినట్లు ఈ పథకాన్ని చూస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ అమలు కోసం ఈ నెల 9న కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.

ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని ప్రభుత్వం నీరుగారుస్తోంది
ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్‌ మరోసారి లేఖాస్త్రం సంధించారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాల్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని లేఖలో ఆరోపించారు. ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీలాంటి పథకాలు అమలుకావడంలేదని మండిపడ్డారు.. సర్కారు నిర్లక్ష్యంతో విద్య, వైద్యంకోసం సామాన్యులు పొలాలు అమ్ముకోవాల్సివచ్చిందని విమర్శించారు.. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లోకూడా ఆరోగ్య శ్రీ అమలుకాకపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. 2016-17 సంవత్సరానికి 9వేలకోట్లు కావాలంటే... ప్రభుత్వం 568కోట్లే ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు.

ఇసుకనుంచి బొగ్గుదాకా అక్రమాలు
చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుకనుంచి బొగ్గువరకూ... రాజధాని భూములనుంచి సదావర్తి భూములవరకూ చేయని దుర్మార్గం ఏమైనా ఉందా? అని జగన్‌ ప్రశ్నించారు.. ఆరోగ్య శ్రీ నిధులు విడుదలకాక చాలా ఆస్పత్రుల్లో రోగులకు వైద్యం చేయడంలేదని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.. ఆరోగ్యశ్రీకి నిధులు విడుదలచేయకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.. ఆరోగ్య శ్రీ రోగులు, వారి బంధువులతో ఈ నెల 9న ఏపీలోని అన్ని కలెక్టరేట్లముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.. 

Don't Miss