నేతలకు జగన్ హెచ్చరికలు..

09:43 - December 7, 2016

హైదరాబాద్ : సొంత పార్టీ నేతలను వైఎస్‌ జగన్‌ సీరియస్‌గా హెచ్చరించారు. గడపగడపకు వైసీపీ కార్యక్రమంపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలకు సూచించారు. ఎన్నికలు ముందే వచ్చే అవకాశాలున్నాయని.. నేతలంతా ప్రజల్లోనే ఉండాలన్నారు. మంచి పేరు ఉన్నవాళ్లకే వచ్చే ఎన్నికల్లో సీట్లు అని స్పష్టం చేశారు.

నేతలకు జగన్ దిశా నిర్ధేశం
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ చేపట్టిన 'గడపగడపకు వైసీపీ' కార్యక్రమం కొన్ని జిల్లాల్లో నేతలు ఉత్సాహంగా పాల్గొంటున్నా.. మరి కొన్ని జిల్లాల్లో అనుకున్నస్థాయిలో నిర్వహించడం లేదని పార్టీ అధినేత జగన్‌ అభిప్రాయపడ్డారు. పార్టీ కార్యాలయంలో పలు జిల్లాలో నేతలతో జగన్‌ విడివిడిగా సమావేశమయ్యారు. నేతలంతా సగం రోజులైనా ప్రజల్లో ఉండాలని జగన్‌ సూచించారు. కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకుంటే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు త్వరలో అన్ని జిల్లాల నేతలకు జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.ప్రజల సమస్యలపై నేతలు స్పందించే తీరుపైనే పార్టీ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందన్నారు జగన్‌. గ్రామస్థాయి నుంచి కమిటీల నియామకాన్ని చేపడుతూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రజల్లో నేతలకు ఉన్న పట్టు ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.

ఎన్నికలకు సిద్ధంగా వుండాలి : జగన్ పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్ని నిర్ణయంతో ఎన్నికలు ముందుగా జరిగే సంకేతాలున్నాయని జగన్‌ నేతలకు
స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు నేతలంగా సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఆరోగ్యశ్రీ పథకంపై అవేదన వ్యక్తం చేసిన జగన్

ఇక పేదల పాలిట సంజీవని అయిన ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నీరుగారుస్తుందని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయాల ముందు జరిగే ధర్నాల్లో నిరుపేద రోగులను, ప్రజలను భాగస్వాములను చేయాలని నేతలకు సూచించారు. జగన్‌ ప్రకాశం జిల్లాలో జరిగే ధర్నాలో పాల్గొనాలని నిర్ణయించారు. 

Don't Miss