‘ఇంటింటికి వైసిపి’...

07:13 - September 11, 2018

విజయవాడ : వచ్చే ఎన్నికల్లో ప్రజల మనస్సులను ఎలా చూరగొనాలి ? ప్రజలను ఎలా ఆకర్షించాలి ? వైసీపీ పట్ల మొగ్గు చూపేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలి ? అనేది దానిపై వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ‘ఇంటింటికి వైసిపి’ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించాలని వైసీపీ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మంగళశారం విశాఖలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు హాజరుకానున్నారు. ఇందుకోసం నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ఏడాది నేపథ్యంలో డిసెంబర్‌లోగా 'ఇంటింటికి' పార్టీ నేతలను పంపి టీడీపీ హామీలను ఎండగడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. ఈ సమావేశంలో ప్రధానంగా దీనిపై చర్చించి.. కార్యాచరణ రూపొందించనున్నారు. అలాగే నేతలంతా 175 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజాసమస్యలను తెలుసుకునే విధంగా ప్రణాళిక రూపొందించనున్నారు. ఇక సర్కార్‌ వైఫల్యాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి.. ప్రజల వద్ద ఎలా ప్రస్తావించాలనే అంశాలపై నేతలకు జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే వైసీపీ ఎజెండాలో ప్రధానమైన నవరత్నాలపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు జగన్‌ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. 

Don't Miss