'మనుస్మృతిని వ్యతిరేకిస్తాం..రాజ్యాంగాన్ని నమ్ముతాం'..

20:57 - January 10, 2018

సంక్షుభిత సమయాలు పరిష్కారాలకోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తాయి. అణచివేత ఆకాశాన్నంటితే పాతాళాన్ని చీల్చుకుంటూ కత్తుల చేతులు, నిప్పుల స్వరాలూ దూసుకొస్తాయి. వివక్షను బోధించిన విలువలతో దేశాన్ని అధోగతి పాల్జేస్తామంటే నిజమైన దేశభక్తి అంటే ఏంటో కొత్త పాఠాలు మొదలవుతాయి. పరిష్కారాల దిశగా దూసుకెళ్లే పావన నవజీవన బృందావన నిర్మాతలుగా కొందరు నవయువకులు తెరపైకివస్తారు.. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాయా లేక మనుస్మృతిని నెత్తిన పెట్టుకున్నాయా అనే సందేహం వచ్చినపుడు యువ హుంకార్ అంటూ ఏకమవుతారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమం గురించి ప్రత్యేక కథనం..ఓ చేతిలో రాజ్యాంగం.. మరో చేతిలో మనుస్మృతి..ఏది కావాలి? ఏది అనుసరిస్తారు..?

హక్కులను, రక్షణలను, సమానత్వాన్ని ప్రసాదించిన రాజ్యాంగాన్నా లేక వివక్షను, అణచివేతను బోధించిన సమాజాన్ని పీడనతో నింపిన మనుస్మృతినా? ఏది కావాలి మీకు? ఇదే యువ హుంకార్ వేసిన ప్రశ్న..హస్తినలో యువ హుంకార్‌ ర్యాలీ గర్జించింది. మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసింది. అవినీతి, పేదరికం, నిరుద్యోగం లాంట ప్రధాన సమస్యలను పక్కన బెట్టి.. ఘర్‌ వాప్‌సి, లవ్‌ జిహాద్‌ లాంటి అంశాలకు ప్రాధ్యనత నిస్తోందని మండిపడింది. దేశానికి మనువాదం ముప్పు పొంచి ఉందని యువతను హెచ్చరించింది. సామాజిక న్యాయం కోసం తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

అడుగడుగునా పోలీసుల నిర్బంధం.. వాటర్ కెనాన్లు, బారికేడ్లు, లాఠీలు...భాష్పవాయుగోళాలు.. వీటన్నిటి మధ్య పార్లమెట్ స్ట్రీట్ లో పెద్ద సంఖ్యలో యువత ఏకమయింది. దళిత, మైనార్టీ వర్గాలపై వివక్ష ఆపాలని, యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని, విద్యార్థి హక్కులను కాపాడాలని, లింగ సమానత్వం కావాలని..., భీమ్‌ కొరెగావ్‌లోని దళితులపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాజధానిలో యువత ఏకస్వరమయింది.

మాకు స్వాతంత్ర్యం కావాలి. విముక్తి కావాలి. దేశంలోపల కోట్లాది ప్రజలను పట్టి పీడిస్తున్న సకల సమస్యలనుండి మాకు విముక్తి కావాలి. ప్రజలంతా సమానమనే వ్యవస్థ సిద్ధించాలి. దానికి అడ్డుగా ఉన్న విలువలు, నమ్మకాలు వాటి మూల సిద్ధాంతాలపై పోరాటం చేస్తూనే ఉంటాం.. గెలుపు దక్కేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ క్రమంలో సకల రోగాలకు కారణమైన మనుస్మృతిని వ్యతిరేకిస్తాం.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం.. ఇదీ యువ హుంకార్ ర్యాలీ ఇస్తున్న సందేశం.. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss